రూ. 31,532 పెట్టుబడులతో ముగిసిన సీఎం అమెరికా పర్యటన

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. సుమారు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సీఎం బృందం నేటి నుంచి దక్షిణ కొరియాలో పర్యటించనున్నది.

By :  Raju
Update: 2024-08-12 02:53 GMT

అమెరికాలోని పారిశ్రామిక వేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని, ప్రఖ్యాత కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం శుభసూచకమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నేటి సీఎం బృందం దక్షిణ కొరియాలో పర్యటించనున్నది.

పెట్టుబడులే లక్ష్యంగా వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం అమెరికా పర్యటన ముగిసింది. పర్యటనలో రూ. 31,532 పెట్టుబడులు సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణను ఫ్యూచర్‌ స్టేట్‌గా ప్రకటించి హైదరాబాద్‌ 4.0 సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులను పారిశ్రామిక వేత్తలకు వివరించారు. సుమారు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో కొత్తగా 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.

ఈ నెల 3న అమెరికా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం దాదాపు 50కి పైగా బిజినెస్‌ మీటింగ్‌లు, 3 రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో పాల్గొన్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, ఫార్మా, లైఫ్‌ సైన్సెన్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు,డేటా సెంటర్లు , ఐటీ ఎలక్ట్రానిక్స్‌ రంగంలో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకోవడానికి పలు కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి. ప్రముఖ కంపెనీలు కాగ్నిజెంట్‌, చార్లెస్‌ స్క్వాబ్‌, ఆర్సీసీఎం, కార్నింగ్‌, ఆమ్జెన్‌, జొయిటిస్‌, హెచ్సీఏ హెల్త్‌ కేర్‌, వివింట్‌ ఫార్మా, థర్మో ఫిసర్‌, ఆరమ్‌ ఈక్విటీ, ట్రైజిన్‌ టెక్నాలజీస్‌, మోనార్క్‌, ట్రాక్టర్‌, అమెజాన్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణ చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

పర్యటనలో భాగంగా సీఎం బృందం యాపిల్‌, గూగుల్‌, స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలతో పాటు ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులతోనూ చర్చలు జరిపింది. అమెరికా పర్యటనపై సీఎం రేవంత్‌ ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలో పేరెన్నిక గల కంపెనీలతో చర్చలు, సంప్రదింపులతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందని అన్నారు. స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ నుంచి ఫ్యూచర్‌ సిటీని నిర్మించడానికి తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలకు అమెరికా కంపెనీల నుంచి భారీ మద్దతు లభించిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు, సీఎస్‌ శాంతి కుమారి, వివిధ శాఖలతో కూడిన రాష్ట్ర బృందం నేటి నుంచి దక్షిణ కొరియాలో పర్యటించనున్నది.

హ్యుందాయ్‌ మోటార్స్‌, యూ యూ ఫార్మా, శాంసంగ్‌, ఎల్‌జీ తదితర కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం చర్చలు జరపనున్నది. హన్‌ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును సీఎం బృందం సందర్శించి దానికి సంబంధించిన అధికారులతో చర్చించనున్నది. ఈ నెల 14 ఉదయం 10:30 గంటలకు సీఎం హైదరాబాద్‌ చేరుకోనున్నారు.

Tags:    

Similar News