సెప్టెంబర్‌లో భారీ వర్షాలు, వరదలు వచ్చే ఛాన్స్‌: ఐఎండీ

సెప్టెంబర్‌లో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల పరిసర ప్రాంతాలు సహా వాయివ్య భారత దేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది.

By :  Raju
Update: 2024-08-31 15:09 GMT

దేశంలో సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. అలాగే వాయువ్య భారతదేశం, దాని పరసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది. దీర్ఘకాల సగటు వర్షం పాతం 167 మి.మీలో 109 శాతంగా ఉంటుందని పేర్కొన్నది. ఈ మేరకు ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర వివరాలు వెల్లడించారు.

సెప్టెంబర్‌లో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల పరిసర ప్రాంతాలు సహా వాయివ్య భారత దేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. ఈ ప్రాంతాల్లో భారీ వానల వల్ల వరదలు రావొచ్చని తెలిపారు. కొండచరియలు, మట్టి దిబ్బలు విరిగే పడే ప్రమాదం పొంచి ఉన్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెప్టెంబర్‌లో ప్రతి వారానికి ఒకసారి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణులు ఏర్పడే అవకాశం ఉన్నదన్నారు. ఇవి పశ్చియ వాయువ్య దిశగా రాజస్థాన్‌ వైపు వెళ్లొచ్చని తెలిపారు. అలాగే హిమాలయాలవైపు మారొచ్చు అన్నారు. ఈ అల్పపీడన ద్రోణుల వల్ల దేశవ్యాప్తంగా గణనీయమైన మొత్తం వర్షాలు పడుతాయన్నారు. 

Tags:    

Similar News