బుడమేరు కాలువపై రెండు గండ్లు పూడ్చివేత

సింగ్‌నగర్‌కు వరదను నియంత్రించడమే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయన్న మంత్రి నిమ్మల

By :  Raju
Update: 2024-09-06 03:38 GMT

విజయవాడలోని బుడమేరు కాలువపై రెండు గండ్లను జలవనరుల శాఖ పూడ్చివేసింది. మూడో గండి పూడ్చివేత పనులను యంత్రాంగం మొదలుపెట్టింది. గండ్ల పూడ్చివేత లక్ష్యానికి చేరువలో ఉన్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వరద పెరిగినా పనులు ముమ్మరంగా చేస్తున్నామన్నారు. ప్రస్తుతం బుడమేరు కాలువకు 9 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నదని వెల్లడించారు. రాత్రి నుంచి మూడవ గండి పూడ్చే పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. సింగ్‌నగర్‌కు వరదను నియంత్రించడమే లక్ష్యంగా యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి గడిచిన 5 రోజులుగా బుడమేరు కాలువ గట్టుపై పనులను పర్యవేక్షిస్తున్నారు. నేడు పూడ్చివేత పనుల్లో సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఇంజినీరింగ్‌ టాస్క్‌ఫోర్స్‌ పాల్గొననున్నది. 

విజయవాడను ముంచెత్తిన వరదకు అసలు కారణం భారీ వర్షాలతో పాటు బుడమేరు ప్రవాహం క్రమబద్ధీకరణ కాకపోవడమేననే వాదనలు ఉన్నాయి. బుడమేరుకు కవులూరు సమీపంలో పడిన గండ్లను పూడ్చడానికి ప్రభుత్వం శ్రమిస్తున్నది. బ్రిడ్జి అప్రోచ్‌-రోడ్డు పనులు పూర్తి చేసి గండ్లు పూడుస్తున్నారు. అదే సమయంలో మళ్లింపు సామర్థ్యాన్ని పెంచడానికి యత్నిస్తున్నది. 

Tags:    

Similar News