జులై 7 నుంచి బోనాల జాతర

భాగ్యనగరంలో బోనాల సందడి వచ్చే నెల ప్రారంభం కానున్నది. జులై 7 నుంచి పండుగను నిర్వహించడానికి సర్కార్‌ సన్నద్ధమౌతున్నది.

By :  Raju
Update: 2024-06-16 07:33 GMT

రాష్ట్ర అస్తిత్వానికి, సంస్కృతికి ప్రతీక నిలిచే బోనాల పండుగను ఈ నెల 7 నుంచి ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఆషాడ బోనాల జాతర నిర్వహణపై జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. జాతర కోసం రూ. 25 కోట్ల రూపాయలు అందించాల్సింది సీఎం రేవంత్‌రెడ్డిని కోరామని మంత్రి తెలిపారు. బోనాలు ముగిసేవరకు అన్నిశాఖల అంతర్గత సమావేశాలతో పాటు ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ జాతర పనులను సకాలంలో పూర్తి చేసి విజయవంతంగా ముగించాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు.

బోనాల జాతరకు తెలంగాణలోని పలు జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని అదనపు బస్సులు కేటాయించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మంత్రి సురేఖ విజ్ఞప్తి చేశారు. బస్టాండ్లలో తాగునీరు, చిన్నపిల్లలకు వైద్యసౌకర్యాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంబారీపై అమ్మవారి ఊరేగింపు కోసం కర్ణాటక నుంచి ఏనుగును తీసుకొస్తున్నట్టు మంత్రి తెలిపారు. పోలీస్‌ శాఖ కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే మెట్రో రైళ్లు మరిన్ని నడుపాలని ఆ సంస్థ యాజమాన్యానికి చెప్పామన్నారు. వర్షకాలం దృష్ట్యా విపత్తు నిర్వహణ విభాగం వేగంగా స్పందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 28 దేవాలయాల్లో 9 చోట్ల మంత్రులు, మిగిలిన చోట్ల దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు మంత్రి తెలిపారు. జులై 21న సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నట్లు చెప్పారు. 

Tags:    

Similar News