కమలా హారిస్‌కు మద్దతుగా బైడెన్‌.. దూరంగా ఒబామా

కొద్ది రోజుల్లో అమెరికా ప్రజలు ఆ దేశ భవిష్యత్తును ఎన్నుకోబోతున్నారని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వ్యాఖ్యానించారు.

By :  Raju
Update: 2024-07-25 05:09 GMT

అమెరికాను ఏకతాటిపై నిలుపడం కోసమే తాను అధ్యక్ష రేసు నుంచి వైదొలిగినట్టు జోబైడెన్‌ ప్రకటించారు. అధ్యక్ష రేసు నుంచి మొదటిసారి ప్రసంగించిన బైడెన్‌.. దానికి గల కారణాలను వివరించారు. తర్వాత తరానికి బాధ్యతలు అప్పగించడమే మేలైన మార్గమని భావించినట్లు తెలిపారు. అమెరికా రాజకీయాల్లో స్పష్టమైన విభజన కనిపిస్తున్నదని దానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పారు. పదవుల కంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే ముఖ్యమంటూ వైదొలగాలన్న తన నిర్ణయాన్ని బైడెన్‌ సమర్థించుకున్నారు. నియంత నిరంకుశుల కంటే దేశం గొప్పదని పరోక్షంగా ట్రంప్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. కొద్ది రోజుల్లో అమెరికా ప్రజలు ఆ దేశ భవిష్యత్తును ఎన్నుకోబోతున్నారని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వ్యాఖ్యానించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఉద్దేశిస్తూ.. నా ఎంపికను నేను ప్రకటించాను అన్నారు. ఇక నిర్ణయం అమెరికా ప్రజల చేతుల్లో ఉన్నది. ఆమె గట్టిగా నిలబడుతుందని, అన్ని సామర్థ్యాలున్నాయన్నారు. ఆమె భాగస్వామం తనకు ఎంతో దోహదపడింది అన్నారు.మిగిలిన ఉన్న ఆరు నెలల పదవి కాలంలో తన విధిని సమర్థవంతంగా నిర్వహిస్తానని బైడెన్‌ హామీ ఇచ్చారు.సామాన్యులపై భారం పడే ధరల పెరుగుదల కట్టడితో పాటు గర్భవిచ్ఛిత్తి హక్కులను కాపాడుతానని చెప్పారు.

అయితే మరోవైపు కమలా హారిస్‌కు మద్దతు ఇవ్వడానికి ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ట్రంప్‌పై ఆమె గెలిచే అవకాశాలు లేవని ఆయన భావిస్తున్నారు. అందుకే బహిరంగంగా మద్దతు ఇచ్చేందుకు విముఖత చూపిస్తున్నట్లు సమాచారం.

కమలకు పదవి దక్కితే దేశం నాశనమే:ట్రంప్‌

మరోవైపు ఎన్నికల ర్యాలీలో కమలాహారిస్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెది రాడికల్‌ లెప్ట్‌ భావజాలమని, కమలకు పదవి దక్కితే దేశం నాశనమే అని ఆరోపించారు. అలా కాకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉన్నదని అన్నారు. 

Tags:    

Similar News