భాగ్యనగర లాల్‌ దర్వాజా బోనాల వేడుకలు.. పాత బస్తీలో రేపు, ఎల్లుండి ట్రాఫిక్‌ ఆంక్షలు

భాగ్యనగరంలో సింహవాహిని శ్రీ మహంకాళి బోనాల సందర్భంగా పాత బస్తీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు.

By :  Vamshi
Update: 2024-07-27 10:18 GMT

ఓల్డ్ సిటీ లాల్‌ దర్వాజ బోనాల పండుగ సందర్భంగా పాత బస్తీలో ఫలక్‌నుమా, చార్మినార్‌, మీర్‌చౌక్‌, బహుదుర్‌పురా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 28, 29వ తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. పాతబస్తీలో ఆదివారం బోనాలు, సోమవారం ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సీపీ వెల్లడించారు. అక్కన్న మాదన్న ఆలయం నుంచి నయాపూల్‌ వరకు కొనసాగే భారీ ర్యాలీలో ఏనుగుపై ఉరేగింపు ఉంటుందన్నారు. పార్కింగ్‌ స్థలాల్లోనే వాహనాలను పార్కు చేయాలని సూచించారు.

సింహ వాహిని మహంకాళి లాల్‌దర్వాజ బోనాలను పురస్కరించుకుని భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వంద ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సింహవాహిని ఆలయంతో పాతబస్తీలోని 28 ప్రధాన దేవాలయాలతో పాటు మరో 330 ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. జూలై 28 ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి జల్లెకడువ నిర్వహిస్తారు. 4 గంటలకు బలిహరణ, 5.30కు దేవీ మహాభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాలబండ శ్రీ అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, చార్మినార్ లో శ్రీ భాగ్య లక్ష్మి ఆలయంలో మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ, మిరాలం మండి శ్రీ మహంకాళి టెంపుల్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు, సబ్జి మండి నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇంకా చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎన్టీఆర్ నగర్ సరూర్ నగర్ శ్రీ ఖిలా మైసమ్మ ఆలయంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, నాచారం ఉప్పల్ శ్రీ మహంకాళి సహిత మహకాళేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

Tags:    

Similar News