గద్వాలలో బండ్ల వర్సెస్‌ సరిత

గద్వాలలో కాంగ్రెస్‌ పార్టీలో బైటపడ్డ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి , జడ్పీ మాజీ ఛైర్మన్‌ సరిత మధ్య విభేదాలు.. మంత్రి జూపల్లిని అడ్డుకున్న సొంత పార్టీ కార్యకర్తలు.

By :  Raju
Update: 2024-08-17 08:04 GMT

గద్వాలలో అధికార కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి , జడ్పీ మాజీ ఛైర్మన్‌ సరిత వర్గీయుల మధ్య నెలకొన్న విభేదాలు మరోసారి బైటపడ్డాయి. నెట్టంపాడు, గట్టు ఎత్తిపోతల పథకం పరిశీలనకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణరావు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యే ఇంటి నుంచి బయల్దేరిన జూపల్లిని చింతలపేట వద్ద సరిత వర్గీయులు అడ్డుకున్నారు. మంత్రి పర్యటన సమాచారం ఇవ్వలేదని ఆమె వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ఇన్‌ఛార్జీకి సమాచారం ఇవ్వకుండా ఎలా పర్యటిస్తారని మంత్రి ఆమె వర్గీయులు నిలదీశారు.మంత్రి వాహనంపై  రాళ్లు విసిరారు. దీంతో సరిత వర్గీయులతో చర్చించడానికి మంత్రి వాహనం దిగారు. ఆయినా ఆమె వర్గీయులు వినకపవోడంతో మంత్రి జూపల్లి సరిత నివాసానికి వెళ్లారు. ఆమెతో చర్చించారు. సరితకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్‌ పార్టీలోకి రావడాన్ని సరిత బహిరంగంగానే వ్యతిరేకించారు. ఆయనను పార్టీలోకి తీసుకోవాలనే అధిష్ఠాన నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. బండ్ల రేవంత్‌ సమక్షంలో కండువా కప్పుకుని ఇటీవల కేటీఆర్‌తో భేటీ తర్వాత గులాబీ గూటికి చేరారని, ఆయన పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన విందు రాజకీయానికి బండ్ల డుమ్మా కొట్టారు. దీంతో మంత్రి జూపల్లి ఆయన ఇంటికి వెళ్లి అల్పాహార విందులో ఆయనను ఒప్పించి తిరిగి ముఖ్యమంత్రి దగ్గరకి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలోనే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తాను కాంగ్రెస్‌లో కొనసాగాలంటే తన కండీషన్లను అంగీకరించాలన్నారు. దానికి సరే అన్న కాంగ్రెస్‌ పార్టీకి గద్వాలలో సరిత నుంచి ఆమె వర్గీయుల నుంచి నిరసనలు వ్యక్తమౌతున్నాయి. 

Tags:    

Similar News