దేశవ్యాప్తంగా 24 గంటల వైద్య సేవలు బంద్‌

కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనకు నిరసనగా ఐఎంఏ పిలుపు

By :  Raju
Update: 2024-08-17 05:01 GMT

కోల్‌కతా వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌( ఐఎంఏ) 24 గంటల బంద్‌ కు పిలుపునిచ్చింది. అత్యవసరం కాని వైద్య సేవలను 24 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు గురువారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకూ ఈ సేవలు ఉండవని తెలిపింది.

హత్యాచార ఘటన జరిగిన ఆర్జీకర్‌ ఆస్పత్రి బైట డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో బంద్‌ కొనసాగుతున్నది. వైద్యుల నిరసన రేపు ఉదయం 6 గంటల వరకు కొనసాగనున్నది. దీంతో ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యం మినహా ఔట్‌ పేషెంట్‌ సేవలు, శస్త్రచికిత్సలు వైద్య సేవలన్నీ నిలిచిపోయాయి.వృత్తి స్వభావం కారణంగా డాక్టర్లు ముఖ్యంగా మహిళా డాకర్లు దాడికి గురయ్యే అవకాశాలు ఎక్కువ అని, కాబట్టి ఆస్పత్రులు, వాటి ప్రాంగణాల లోపల, బైట వైద్యులకు అధికారులు భద్రత కల్పించాలని ఐఎంఏ డిమాండ్‌ చేసింది.

ఈ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ 24 గంటలు దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్‌ హాస్పిటల్స్‌లో ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.ఇండియా గేట్‌ వద్ద వైద్యులు క్యాండిల్‌ మార్చ్‌ నిర్వహించారు.డెంటిస్ట్‌ అసోసియేషన్‌ వైద్య బృందం సికింద్రాబాద్‌లో పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి క్లాక్‌టవర్‌ వరకు ర్యాలీ చేపట్టింది.వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ విద్యార్థులు ప్లకార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉండాలని, ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

 


Tags:    

Similar News