నేటి నుంచి బల్కంపేట్ ఎల్లమ్మ జాతర.. 3 రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు

తెలంగాణలో ప్రసిద్ది చెందిన బల్కంపేట్ ఎల్లమ్మ జాతర నేటి నుంచి 10వ తేదీ వరకు 3 రోజులు నిర్వహించనున్నారు.

By :  Vamshi
Update: 2024-07-08 04:50 GMT

రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన బల్కంపేట్ ఎల్లమ్మ జాతర ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా రేపు అమ్మవారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానుండడంతో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వహకులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారబాద్ జిల్లాల నుంచి అత్యధికంగా భక్తులు రానున్నట్లు తెలుస్తోంది. ఎల్లమ్మ కల్యాణోత్సవం సందర్భంగా ఈరోజు నుంచి 10వ తేదీ వరకు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర అదనపు పోలీసు కమిషనర్‌(ట్రాఫిక్‌) పి.విశ్వ ప్రసాద్‌ పేర్కొన్నారు.

వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సూచించారు. నగరంలోని గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట కనకదుర్గా ఆలయం వైపు నుంచి సత్యం థియేటర్‌ మీదుగా ఫతేనగర్‌ వెళ్లే వాహనాలు బల్కంపేట మీదుగా అనుమతించరు. దీంతో గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట కనకదుర్గా ఆలయం నుంచి సత్యం థియేటర్‌ మీదుగా ఎస్సార్‌నగర్‌ టి-జంక్షన్‌ నుంచి ఎడమవైపు మలుపు తీసుకుని ఎస్సార్‌నగర్‌ కమ్యూనిటీహాల్‌ కూడలి నుంచి కుడి వైపు మలుపు తీసుకొని బీకేగూడ, శ్రీరామ్‌నగర్‌ ఎక్స్‌ రోడ్డు మీదుగా ఫతేనగర్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఫతేనగర్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నుంచి బల్కంపేట మీదుగా వాహనాల రాకపోకలు ఉండవు. ఇక్కడి నుంచి అమీర్‌పేట వైపు వెళ్లాల్సిన వాహనాలు బల్కంపేట-బేగంపేట లింకు రోడ్డు మీదుగా తాజ్‌ వివంతా హోటల్‌ నుంచి యూటర్న్‌ తీసుకుని గ్రీన్‌ల్యాండ్స్‌ మీదుగా వెళ్లాలని అధికారులు వెల్లడించారు. బేగంపేట కట్ట మైసమ్మ దేవాలయం నుంచి లింకు రోడ్డు మీదుగా బల్కంపేటకు వాహనాలు అనుమతించరు.

Tags:    

Similar News