కవితకు బెయిల్‌.. బీఆర్‌ఎస్‌ నేతల హర్షం

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం పట్ల బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

By :  Raju
Update: 2024-08-27 09:49 GMT

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం పట్ల బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు టపాసులు కాల్చి సంబురాలు చేసుకుంటున్నారు. ఈ కేసులో 160 రోజులకు పైగా జైలులో ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వడంపై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ఇష్టంవచ్చినట్లు మాట్లాడటంపై నేతలు ఫైర్‌ అవుతున్నారు. కోర్టు ఆదేశాలను తప్పుపట్టేలా మాట్లాడేవారు కోర్టు ధిక్కారం కిందికి వస్తారని హెచ్చరిస్తున్నారు.

అన్యాయంగా ఇంతకాలం జైల్లో ఉంచారు: ఎంపీ వద్దిరాజు

ఢిల్లీ లిక్కర్ పాలసీతో ఏ మాత్రం సంబంధం లేకున్నా తమ పార్టీ ఎమ్మెల్సీ కవితపై ఈడీ అక్రమంగా కేసు బనాయించి 165 రోజులు అన్యాయంగా జైల్లో ఉంచడడం తీవ్ర బాధాకరమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కవితకు బెయిల్ మంజూరైన సందర్భంగా మంగళవారం ఎంపీ వద్దిరాజు సుప్రీంకోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు.

లిక్కర్ పాలసీలో కవిత ప్రమేయం లేదని, దీనికి సంబంధించి ఆమె వద్ద నుంచి ఎలాంటి పత్రాలు, ఆధారాలు లభించలేదని,కేసులో దమ్ము లేదని అన్యాయంగా, అక్రమంగా బనాయించారని తాము మొదటి నుంచి కూడా చెబుతున్నాం. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో బెయిల్ మంజూరు చేయడం ఊరట కలిగించే అంశం అన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్న కవితను ఇతర సామాన్య ఖైదీలా చూడడం పట్ల న్యాయస్థానం కూడా తప్పుబట్టిందన్నారు.ఈ కేసులో కవిత కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్తారని ఆయన స్పష్టం చేశారు. కవితకు బెయిల్ మంజూరు కావడం పట్ల తెలంగాణ ప్రజలు, మహిళామణులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇందుకు మొదటి సహకరించిన న్యాయవాదులు, ప్రెస్ అండ్ మీడియా, పార్టీ ప్రముఖులకు వద్దిరాజు ధన్యవాదాలు తెలిపారు.

సుప్రీంకోర్టు న్యాయం పక్షాన నిలిచింది:ఎమ్మెల్సీ మధుసూధనాచారి

ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ ఇచ్చి సుప్రీంకోర్టు న్యాయం పక్షాన నిలిచిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మధుసూధనాచారి అన్నారు. బెయిల్‌ను స్వాగతిస్తున్నామన్నారు. ఇది బీఆర్‌ఎస్‌ తో పాటు తెలంగాణవాదులకు ఊరటనిచ్చే వార్త అన్నారు. లిక్కర్‌ పాలసీ కేసు అక్రమంగా పెట్టారని, అందులో ఎలాంటి నిజాలు లేవని మేం మొదటి నుంచీ చెబుతున్నాం. కవితకు బెయిల్‌ బీఆర్‌ఎస్‌ సాధించిన నైతిక విజయం అన్నారు.

అక్రమ కేసులో సక్రమంగా బెయిల్‌: రావుల

అక్రమ కేసులో కవితకు సక్రమంగా బెయిల్‌ వచ్చిందని బీఆర్‌ఎస్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ నేతలు వక్రంగా మాట్లాడటం తగదన్నారు. కేసు నుంచి కూడా పూర్తి ఉపశమనం లభిస్తుందన్నారు.

కాంగ్రెస్‌ నేతలు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి: దేవీ ప్రసాద్‌

కవితకు బెయిల్‌పై కొందరు ఇష్టారీతిన మాట్లాడటంపై బీఆర్‌ఎస్‌ నేత దేవీ ప్రసాద్‌ మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పుపట్టేలా మాట్లాడుతున్నవారు కోర్టు ధిక్కారం కిందికే వస్తారు. కాంగ్రెస్‌ నేతలు పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలన్నారు.

Tags:    

Similar News