మేం ఉగ్ర‌వాదుల‌మా..? దొంగ‌ల‌మా..? ఇదేనా ప్ర‌జా పాల‌న

నాంప‌ల్లి ఏరియాలో ఓ ఇద్ద‌రు దంప‌తులు రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా.. వారిని పోలీసులు అరెస్టు చేశారు. మేం ఉగ్ర‌వాదుల‌మా..? దొంగ‌ల‌మా..? ఇదేనా ప్ర‌జా పాల‌న అని ఆ దంప‌తులు నిల‌దీశారు.

By :  Vamshi
Update: 2024-07-05 12:20 GMT

రాష్ట్రంలో తమ సమస్యలను పరిష్కరించాలని గళమెత్తిన నిరుద్యోగులకు సమైక్య పాలనలో ముళ్ల కంచెలు మళ్లీ గుర్తు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. తెలంగాణ ద్రోహులకు స్వాగత సత్కారాలు అని ఎక్స్‌లో పేర్కొన్నారు. నిరుద్యోగుల నిరసన నేపథ్యంలో హైదరాబాద్ టీజీపీఎస్సీ వద్ద పోలీసు భద్రత పెంచారని, ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తూ బ్యానర్ల కట్టారని వీడియోను షేర్ చేసింది. సమైక్య పాలనను మళ్లీ గుర్తు చేస్తున్న గుంపు మేస్త్రీ అంటూ మండిపడింది. నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ అదుపులోకి తీసుకున్నరు.

ఈ క్ర‌మంలో పోలీసులు టీజీపీఎస్‌సీ వద్ద రోడ్డు మీద పోయేవాళ్ళని సైతం అరెస్ట్ చేస్తున్నారు. సామాన్య ప్రజలు తాము ధ‌ర్నా కోసం రాలేద‌ని, రోడ్డు మీద వెళ్తున్నామ‌ని చెప్పినా వినిపించుకోకుండా అదుపులోకి తీసుకున్నారు. ఒక రైతు, ఒక లాయర్, ఆఫీసుకు వెళ్తున్న ఒక ఉద్యోగి వాపోయారంటూ బీఆర్ఎస్ తన ట్వీట్ లో పేర్కొంది. త‌మ‌ను వ‌దిలిపెట్టాల‌ని వారు పోలీసుల‌ను కోరుతున్న వీడియోను కూడా బీఆర్ఎస్ పార్టీ పంచుకుంది. ఈ అరెస్టుల‌ తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఓ రైతు లుంగీ క‌ట్టుకోని మ‌రో ఇద్ద‌రితో క‌లిసి నాంప‌ల్లి ఏరియాలో రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తున్నాడు. పోలీసులు ఆ రైతుతో పాటు మ‌రో ఇద్ద‌రిని అడ్డుకున్నారు.

బ‌ల‌వంతంగా పోలీసు వాహ‌నం ఎక్కించే ప్ర‌య‌త్నం చేశారు. తాను త‌న కొడుకు కాలేజీ కోసం వ‌చ్చాన‌ని స‌ద‌రు రైతు చెప్పిన‌ప్ప‌టికీ పోలీసులు వినిపించుకోలేదు. ధ‌ర్నాకు రాలేద‌ని మొత్తుకుంటుంటే.. మ‌రి ఎక్క‌డికి వ‌చ్చావంటూ రైతును ప్ర‌శ్నిస్తూ పోలీసులు ఓవ‌రాక్ష‌న్ చేశారు. అమాంతం ఆయ‌న‌ను పోలీసు వాహ‌నంలోకి ఎక్కించారు. నిరుద్యోగులకు మద్దతుగా ఆందోళనకు దిగిన బర్రెలక్కను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News