మరో రూ. 1000 కోట్ల రుణం కావలెను

రాష్ట్ర ప్రభుత్వం రుణాద్వారా మరో రూ. 1000 కోట్లు సమీకరించుకోనున్నది. ఈ మేరకు రిజర్వు బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసింది.

By :  Raju
Update: 2024-06-22 03:00 GMT

రాష్ట్ర ప్రభుత్వం రుణాద్వారా మరో రూ. 1000 కోట్లు సమీకరించుకోనున్నది. ఈ మేరకు రిజర్వు బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసింది. వెయ్యి కోట్ల విలువైన బాండ్లను 18 సంవత్సరాల కాలానికి రాష్ట్ర ఆర్థికశాఖ బాండ్లను జారీ చేసింది. వచ్చే మంగళవారం ఆర్బీఏ ఈ బాండ్లను వేలం వేయనున్నది. అనంతరం రూ. 1000 కోట్ల మొత్తం ప్రభుత్వ ఖజానాకు జమ అవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 12 కోట్ల రూపాయలను అప్పుల రూపంలో సమీకరించుకున్నది. తాజా వెయ్యికోట్లతో ఆ మొత్తం రూ. 13,000 కోట్లకు చేరనున్నది.

అప్పులపై కాంగ్రెస్‌పార్టీ ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తున్నది. గత ప్రభుత్వం సంక్షేమం, వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సౌకర్యాల కల్పనకు అప్పులు తీసుకుని ప్రాధాన్య రంగాల వారీగా నిధులు కేటాయించి వాటి ఫలాలను ప్రజలకు అందించింది. దీనిపై నాడు విపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు చేసింది. గత ప్రభుత్వం ఇబ్బడిముబ్బడి అప్పలు చేసిందని ఆరోపించింది. అసెంబ్లీలో పొంతనలేని అంకెలతో శ్వేత పత్రం విడుదల చేసింది. వాస్తవ లెక్కలకు ప్రభుత్వం లెక్కలకు పొంతన కుదరక అభాసుపాలైంది. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోనే రూ. 12 వేల కోట్ల రుణాలు చేసింది. అప్పు అభివృద్ధిలో భాగమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అప్పులపై విపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, అధికారంలోకి వచ్చాక అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు వస్తున్నాయి. అలవిగాని హామీలు ఇచ్చి వాటి నెరవేర్చడంలో విఫలమై గత ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అప్పులు చేయడంపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Tags:    

Similar News