వయనాడ్‌ విషాదంలో 287 మంది మృత్యువాత

కేరళలో వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 287కు చేరింది.

By :  Raju
Update: 2024-08-01 04:30 GMT

కేరళలో వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 287కు చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న వారికి కోసం సహాయక చర్యలను వేగవంతం చేశారు. మరోవైపు బాధిత ప్రాంతాల్లో కేరళ సీఎం పినరయి విజయన్‌ కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు పర్యటించనున్నారు. మరోవైపు కేరళ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వయనాడ్‌లో 191 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాకపోగా 80 పైగా మృతదేహాలను వెలికి తీసినట్టు సైన్యం ప్రకటించింది. వెయ్యిమందిని రక్షించినట్టు తెలిపింది. మానవతా సాయం కోసం కోజికోడ్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఆర్మీ ఏర్పాటు చేసింది.

కొండచరియలు విరిగి పడిన ప్రాంతంలో పదుల సంఖ్యలో మృత దేహాలు కొట్టుకుపోవడంతో ఎస్టీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో కలిసి సైనికులు సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. తిరువనంతపురం నుంచి వైద్య సిబ్బందిని హెలికాప్టర్‌ ద్వారా తరలించి పునరావస కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నారు. బెయిలీ వంతెల నిర్మాణం వల్ల సహాయ చర్యలు వేగం పుంజుకుంటున్నాయని తెలిసింది.

కేరళ ఆరోగ్య శాఖమంత్రి వీణాజార్జ్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 154 మృత దేహాలను జిల్లా అధికారులకు అప్పగించామని తెలిపారు. శిథిలాల కింద దొరికిన మృతదేహాలను జెనెటిక్‌ శాంపిళ్లను సేకరిస్తున్నాం. సీఎం పినరయి విజయన్‌ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ సహాయం కోరారు.

వాయనాడ్‌ ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. కేరళ సీఎం సహాయనిధికి అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ మేరకు సోషల్‌ మీడియా ఎక్స్‌ ద్వారా ప్రకటించిన ఆదానీ వయనాడ్‌ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కేరళ ప్రజలకు తమ సంస్థ అండగా ఉంటుందని అదాని తెలిపారు. అదానీతో పాటు ఆర్‌పీ గ్రూప్‌ ఛైర్మన్‌ రవి పిళ్లై, లూలు గ్రూప్‌ ఛైర్మన్‌ ఎంఏ యూసఫ్‌ ఆలీ, కల్యాణ్‌ జ్యూవెల్లర్స్‌ ఛైర్మన్‌ టీఎస్‌ కల్యాణ్‌ రామన్‌ లు కూడా తలో రూ. 5 కోట్ల రూపాయలు కేరళ సీఎం సహాయం నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. తమిళ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ రూ. 20 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మలయాళ చిత్ర పరిశ్రమ వయనాడ్‌ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. కొన్నిరోజుల పాటు సినిమా ఫంక్షన్లు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. 

Tags:    

Similar News