తెలంగాణలో విడుదల కానున్న 213 మంది ఖైదీలు

తెలంగాణలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

By :  Vamshi
Update: 2024-07-02 15:46 GMT

రాష్ట్రంలో 213 మంది ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీరందరూ రూ.50 వేల సొంత పూచీకత్తును సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. విడుదలైన వారు ప్రతి మూడు నెలలకు ఓసారి జిల్లా ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నాది. విడుదలవుతున్న 213 మంది ఖైదీలలో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్నవారు ఉన్నారు. ఇదిలా ఉండగా, విడుదల కానున్న ఖైదీలకు ఉపాధి కల్పించాలని గవర్నర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. వీరికి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న పెట్రోల్ బంకులు వంటి చోట్ల ఉపాధి కల్పిస్తారు.

ఏటా స్వాతంత్ర్య దినోత్సవం లేదా గాంధీ జయంతి లాంటి సందర్భాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తుంటారు. అయితే, తెలంగాణ ఏర్పడిన తరువాత ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే విడుదల చేశారు. 2016లో తొలిసారిగా ఖైదీలను విడుదల చేశారు. రెండోసారి 2020 అక్టోబర్ 2న 141 మంది ఖైదీలను విడుదల చేశారు. 2022లో 150 మందిని విడుదల చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. కానీ, పలు కారణాల వల్ల ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభించలేదు. ఈ ఏడాది జనవరిలోనే విడుదలకు జైళ్ల శాఖ జాబితా తయారు చేసినప్పటికీ తాజాగా మార్గం సుగమం అయ్యింది.

Tags:    

Similar News