166 ఆక్రమణలు తొలగించాం.. 44 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాం

నెల రోజుల ప్రగతిపై ప్రభుత్వానికి ‘హైడ్రా’ నివేదిక

Update: 2024-08-25 13:14 GMT

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ అథారిటీ (హైడ్రా) ఏర్పాటు చేసిన నెల రోజుల్లోపే 166 ఆక్రమణలు కూల్చేసి 44 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని ప్రభుత్వానికి హైడ్రా నివేదిక సమర్పించింది. జూన్ 27 నుంచి ఆగస్టు 24 వరకు హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతల వివరాలను అందులో పేర్కొన్నారు. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్ టీఎల్), బఫర్ జోన్లు, పార్క్ స్థలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు తొలగించామని పేర్కొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్, టీటీడీ మాజీ సభ్యుడు, కావేరి సీడ్స్ యజమాని భాస్కర్ రావు, మంథనికి చెందిన బీజేపీ నాయకుడు సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ లీగ్ టీమ్ ఓనర్ శ్రీనివాస్ రావు భార్య తదితరులు ఉస్మాన్ సాగర్ చెరువును ఆక్రమించి నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ సహా నిర్మాణాలను కూల్చేసి దాదాపు 15 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

సినీ హీరో నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చేసి 4.09 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ రాజేంద్రనగర్ లో చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు తొలగించి 12 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. గాజుల రామారంలో బీఆర్ఎస్ స్థానిక నాయకుడు రత్నాకరం రాజు చింతల్ చెరువును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు తొలగించి మూడున్నర ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నందగిరి హిల్స్ లో పార్క్ స్థలం ఆక్రమించి నిర్మించిన 16 షెడ్లను కూల్చేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఈ క్రమంలో తమ విధి నిర్వహణకు అడ్డం తగిలిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లోని చెరువుల్లోని ఆక్రమణలను తొలగించి ఆయా భూములను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ప్రభుత్వానికి హైడ్రా సమర్పించిన నివేదిక కోసం ఈ కింది లింక్​ క్లిక్​ చేయండి

https://www.teluguscribe.com/pdf_upload/hydraa-demolition-drives-details-25082024-240825145436-869353.pdf


Tags:    

Similar News