వయనాడ్‌ విషాదం.. 143 కు చేరిన మృతుల సంఖ్య

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది.

By :  Raju
Update: 2024-07-31 02:49 GMT

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో విషాదం నెలకొన్నది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ఈ ఘటనలో ఇప్పటివరకు 143 మంది చనిపోయినట్లు కేరళ వైద్యారోగ్యశాఖ బుధవారం పొద్దున వెల్లడించింది.

ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు 128 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నది. దాదాపు 400 కుటుంబాలు వీధినపడ్డాయి. వయనాడ్‌లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. తాత్కాలిక బడ్జిని వినియోగించి ఆర్మీ 1000 మందిని రక్షించింది. 

కేరళలోని వయనాడ్‌ జిల్లా మెప్పడి, మండక్కై, చూరాల్‌మల, అట్లామల, నూల్‌పుజా గ్రామాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడటంతో గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే సుమారు 600 మంది వలస కూలీల ఆచూకీ లభించడం లేదు.

కేరళలో మృతదేహాల వెలికితీత ప్రక్రియ కొనసాగుతున్నది. ముండక్కిలో ఘోరాలు వెలుగు చూస్తున్నాయి. కుళ్లిన, అస్తవ్యస్త స్థితిలో మృతదేహాలు కనిపిస్తున్న వైనం ఉన్నది. లోతట్టు ప్రాంతాలకు చేరుకునే మార్గాలు లేకపోవడంతో సహాయక బృందాలు బుధవారం ఉదయం వెళ్లారు. కుర్చీలో కూర్చొని, మంచంపై పడుకున్న స్థితిలోనే బురదలో మృతదేహాలు కూరుకుపోయాయి. 

మరోవైపుకేరళ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కంట్రోల్ రూంను కూడా ప్రారంభించింది. అత్యవసర సహాయం అవసరమైన వారు 9656938689 మరియు 8086010833 హెల్ప్‌లైన్ నంబర్లలో అధికారులను సంప్రదించవచ్చని పేర్కొన్నది. 

Tags:    

Similar News