ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చడానికే అక్రమ అరెస్టులు

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌

Update: 2024-09-05 13:46 GMT

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై రోజు రోజుకు ప్రజావ్యతిరేకత పెరుగుతోందని.. దాని నుంచి దృష్టి మరల్చడానికే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ డిజిటల్‌ మీడియా మాజీ డైరెక్టర్‌, తెలంగాణవాది కొణతం దిలీప్‌ అరెస్టును ఆయన ఖండించారు. గురువారం బషీర్‌బాగ్‌ లోని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్ కుమార్‌ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతోనే దిలీప్‌ ను అరెస్ట్‌ చేశారన్నారు. పోలీసుల మీద ఆధారపడి నెట్టుకురావాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. హామీలు అమలు చేయలేరు కాబట్టి మిగతా డిపార్ట్‌మెంట్లు పని చేసే పరిస్థితి లేదని, అందుకే పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేవాళ్లను అక్రమంగా నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. దిలీప్‌ ను ఎందుకు అరెస్ట్‌ చేశారంటే సరైన కారణాలు చెప్పడం లేదన్నారు. ఏదో అనుమానం ఉంది, ప్రశ్నిస్తామని చెప్తున్నారని, అంటే ఇదేమైనా పోలీసు రాజ్యమా అని ప్రశ్నించారు. దిలీప్‌ ను అదుపులోకి తీసుకున్నందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

దిలీప్‌ ను ఏ ఆధారం లేకుండానే పోలీసులు అరెస్టు చేశారని, తన కుటుంబ సభ్యులతో కమ్యునికేషన్‌ లేకుండా కొన్ని గంటల పాటు నిర్బంధంలో పెట్టారని ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ అన్నారు. ఆధారాలు చూపించలంటే పోలీసుల నుంచి స్పందన లేదన్నారు. తెలుగు స్క్రైబ్‌ ట్విట్టర్‌ లో చేసిన పోస్టుకు దిలీప్‌ కు సంబంధం ఏమిటి అంటే కూడా చెప్పడం లేదన్నారు. మత కల్లోలాను ఎప్పుడూ బీఆర్‌ఎస్‌ ప్రోత్సహించదని, గంగాజమున తెహజీబ్‌ సంస్కృతిని కేసీఆర్‌ కాపాడారని అన్నారు. బీజేపీ నేతలు ఓపెన్‌ గానే మత కల్లోలాలు వ్యాప్తి చేసేలా వాళ్ల అఫీషియల్‌ హ్యాండిల్స్‌ లో పోస్ట్‌ చేస్తున్నారని తెలిపారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఆ పార్టీ వాళ్లను అరెస్ట్‌ చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఐటీ సెల్‌ కు దిలీప్‌ అపాయింట్‌ అయినట్టు ఏదైనా లెటర్‌ ఉందా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి తెలుగు స్క్రైబ్‌ కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి ఇకనైనా ప్రతీకార రాజకీయాలు మానుకోవాలన్నారు. దిలీప్‌ ను విడుదల చేసే వరకు సీసీఎస్‌ నుంచి వెళ్లబోమని తేల్చిచెప్పారు. వారి వెంట పార్టీ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాసోజు శ్రవణ్, కార్తీక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News