కోల్‌కతా హత్యాచార కేసులో ట్విస్ట్‌.. పోలీసులు లంచం ఇవ్వజూపారు

కోల్‌కతా మృతురాలి తండ్రి సంచలన ఆరోపణలు

By :  Raju
Update: 2024-09-05 05:45 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు యత్నించారని, హడావుడిగా తమ కూతురు అంత్యక్రియలు పూర్తి చేయించారని తెలిపారు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని ఆరోపించారు.

వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసగా బుధవారం రాత్రి కోల్‌కతాలో ఆందోళనలు జరిగాయి. ఇందులో బాధితురాలి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మృతురాలి తండ్రి మాట్లాడుతూ... 'ప్రజలకు నిజాలు తెలియకుండా కేసును అణగదొక్కడానికి పోలీసులు మొదటి నుంచి ప్రయత్నించారు. మృతదేహాన్ని చూడటానికి కూడా మమ్మల్ని అనుమతించలేదు. పోస్ట్‌మార్టం పూర్తయ్యేవరకు పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారు. ఆ తర్వాత మృతదేహాన్ని మాకు అప్పగిస్తుండగా.. ఓ సినియర్‌ పోలీసు అధికారి మా వద్దకు వచ్చి డబ్బులు ఆఫర్‌ చేశారు. మేం దాన్ని తిరస్కరించాం' అని ఆయన వెల్లడించారు.

ఈ కేసును మొదట కోల్‌కతా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు సమయంలో వారు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే కోల్‌కతా హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం ఈ కేసుపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతున్నది. ఇప్పటికే నిందితుడు సంజయ్‌ రాయ్‌ సహా, ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌, మరికొందరికి పాలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News