మలయాళం నటుడు, ఎమ్మెల్యే ముకేశ్‌పై అత్యాచారం కేసు

నటులు ముకేశ్‌, జయసూర్య, మణియన్‌పిళ్ల రాజులపై కూడా కేసులు నమోదు

By :  Raju
Update: 2024-08-29 08:32 GMT

మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక సంచలనం సృష్టిస్తున్నది. ఈ నివేదిక బైటికి వచ్చిన తర్వాత కొంతమంది నటీమణులు కొందరు నటులపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే నటుడు ముకేశ్‌,జయసూర్యలపై కేసులు నమోదయ్యాయి.

మలయాల చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ సమర్పించిన నివేదిక సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదిక వల్ల ఇప్పటివరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 17 కేసుల వరకు నమోదైనట్టు సమాచారం. కేరళకు చెందిన ప్రముఖ నటుడు, అధికారపార్టీ సీపీఐ (ఎం) ఎమ్మెల్యే ఎం. ముకేశ్‌పై పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. కొన్నేండ్ల కిందట తనను ముకేశ్‌ లైంగిక వేధించాడంటూ నటి మిను మునీర్ చేసిన ఆరోపణల మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

కొచి నగరంలోని మారడు పోలీస్‌ స్టేషన్‌లో ఐపీసీ 376 సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) అమల్లోకి రాకముందే ఈ సంఘటన జరిగినందున ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు ఆ అధికారి పేర్కొన్నారు. హేమ కమిటీ రిపోర్టు వెలువరించాక తర్వాత మలయాళ ఇండస్ట్రీలో నమోదైన మూడో హై ప్రొఫైల్‌ కేసు ఇది. నటులు జయసూర్య, మణియన్‌పిళ్ల రాజుపై కూడా కేసు ఫోర్ట్‌ కొచి పోలీస్‌ స్టేషన్‌ సెక్షన్‌ 354 కింద నమోదు చేశారు. ఈ విషయాన్ని ఎర్నాకుళం సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. ఇదే సెక్షన్‌ కింద జయసూర్యపై కేసు నమోదైనట్లు తిరువనంతపురం పోలీసు అధికారి చెప్పారు.

హేమ కమిటీ రిపోర్ట్‌పై నటుల స్పందన

హేమ కమిటీ రిపోర్ట్‌పై నటి సమంత స్పందించారు. పని ప్రదేశాల్లో భద్రత మహిళల కనీస అవసరం అన్నారు. వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ (డబ్ల్యూసీసీ)పై ప్రశంసలు కురిపించారు.నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ మాట్లాడుతూ.. మహిళలు పనిచేసే ప్రతి పరిశ్రమలో జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్టు ఉండాలన్నారు. మహిళల సంరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు.మరోవైపు హేమ కమిటీ రిపోర్ట్‌పై నటుడు విశాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వారికి బుద్ధి వచ్చేలా చేయాలన్నారు. కోలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితులు లేవని చెప్పను అన్నారు.

Tags:    

Similar News