బద్లాపూర్‌ ఘటనపై మహావికాస్‌ అఘాడీ మౌనదీక్ష

బద్లాపూర్‌లో నర్సరీ చదివే చిన్నారులపై జరిగిన లైంగికదాడికి నిరసనగా మహారాష్ట్రవ్యాప్తంగా మౌనదీక్షలు కొనసాగుతున్నాయి.

By :  Raju
Update: 2024-08-24 08:34 GMT

బద్లాపూర్‌లో నర్సరీ చదివే చిన్నారులపై జరిగిన లైంగికదాడికి నిరసనగా మహారాష్ట్రవ్యాప్తంగా మౌనదీక్షలు కొనసాగుతున్నాయి. మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమి నేతలు నోటికి నల్ల రిబ్బన్‌ కట్టుకుని మౌన దీక్ష చేస్తున్నారు. చిన్నారులపై లైంగికదాడికి నిరసనగా మహా వికాస్‌ అఘాడీ నేడు మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే ఆ నిర్ణయంపై బాంబే హైకోర్టు నిషేధం విధించింది. రాజకీయ పార్టీలు, వ్యక్తులు ఎవరూ బంద్‌ పాటించకూడదని నిషేధం విధించింది. ఈ క్రమంలో మౌన దీక్షలు చేపట్టాలని నేతలు నిర్ణయించారు.

ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తన కుమార్తె సుప్రీయా సూలెతో కలిసి వర్షంలో తడుస్తూనే పూణెలో దీక్షలో పాల్గొన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే చేతులు నరికే శివాజీ పాలించిన మహారాష్ట్రలో ఈ ఘటనలు జరగడం దారణం అన్నారు. దేశంలో మహారాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు.ముంబైలో మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే పార్టీ శ్రేణులతో కలిసి మౌన దీక్ష చేపట్టారు. ఏక్‌నాథ్‌ శిండే ప్రభుత్వం దోషులపై చర్యలు తీసుకోకుండా నిందితుల పక్షాన నిలుస్తున్నదని ధ్వజమెత్తారు. కోర్టు బంద్‌ను నిలిపివేసినా తమ గళం వినిపిస్తుందన్నారు.

మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో మూడు, నాలుగేళ్ల చిన్నారులపై ఓ స్వీప్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు చిన్నారులపై ఒక్కసారి కాకుండా గత పదిహేను రోజులుగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రత్యేక కమిటీ పేర్కొన్నది. నిందితుడు అక్షయ్‌ శిందే నేపథ్యం గురించి ఎలాంటి తనిఖీలు చేయకుండానే ఆగస్టు 1న అతనికి కాంట్రాక్ట్ వర్కర్‌గా నియమించుకున్నారని కమిటీ తన నివేదికలో పేర్కొన్నది. స్కూల్‌కు సంబంధించిన ఐడీ కూడా అతని వద్ద లేదని తెలిపింది. స్కూల్‌లో వాష్‌ రూమ్‌ స్టాఫ్‌ రూమ్‌కు దూరంగా ఉందని, పిల్లల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదని వెల్లడించింది.

ఈ ఘటనలను మహారాష్ట్రలో విపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే కోర్టు బంద్‌ నిర్వహించకూడదు అని ఆదేశించడంతో మహారాష్ట్ర వ్యాప్తంగా మహా వికాస అఘాడీ నేతలు నోటికి నల్ల రిబ్బన్‌ కట్టుకుని మహాయుతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మౌన దీక్ష చేశారు. 

Tags:    

Similar News