ఇరాన్‌లో హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్యకు గురయ్యాడు.

By :  Raju
Update: 2024-07-31 07:08 GMT

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్యకు గురయ్యాడు. హమాస్‌ చీఫ్‌ హత్యకు ఇజ్రాయెల్‌ నిఘా సంస్థే కారణమని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. హనియేను చంపుతామని నెతన్యూహూ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. హమాస్‌ చీఫ్‌ ఖతార్‌లో నివసిస్తున్నాడు. ఇరాన్‌ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి టెహ్రాన్‌ వెళ్లాడు. హనియే ఎలా హత్యకు గురయ్యాడనే వివరాలను ఇరాన్‌ వెల్లడించలేదు. ఈ హత్య ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని ఇరాన్‌ సైన్యం ప్రకటించింది. హనియే హత్యపై ఇప్పటివరకు ఇజ్రాయెల్‌, అమెరికా స్పందించేలేదు. హమాస్‌ చీఫ్‌ హత్యతో ఉద్రిక్తతలు మరింత పెరగనున్నాయి. హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా కృషి చేస్తున్నది. ఈ కీలక సమయంలో హనియే హత్య ఘటన పరిస్థితిని సంక్లిష్టం చేసే అవకాశం ఉన్నది.

మరోవైపు తమ అధినేత ఇస్మాయిల్‌ హనియా హత్య ఇజ్రాయెల్‌కు అనుకున్న ఫలితాలను ఇవ్వదని హమాస్‌ ప్రకటించింది. ఏ నాయకుడు చనిపోయినా.. హమాస్‌ ఉద్యమం కొనసాగేంత బలంగా ఉన్నదని హమాస్‌ నాయకుడు అబు జుహరి ప్రకటించారు. 

ఇస్మాయిల్‌ హనియా చనిపోయిన నేపథ్యంలో ప్రజలకు ఇరాన్‌ సంఘీభావం తెలిపింది. హమాస్‌ ఛీఫ్‌ హత్యను ఖండిస్తూ సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్టు పెట్టింది. 

Tags:    

Similar News