జమ్ములో భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాల చేతిలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌ ఇద్దరు భారత సైనికులు వీరమరణం పొందారు.

By :  Raju
Update: 2024-07-07 09:37 GMT

జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాల చేతిలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో నలుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వారి కోసం భద్రతాబలగాలు గాలిస్తున్నాయి.  ముష్కరులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఈ ఎన్‌ కౌంటర్‌లో ఇద్దరు భారత సైనికులు చనిపోయారు.

కుల్గాం జిల్లాలోని ప్రిసల్‌ చిన్నగాం, మోడెర్గాం గ్రామాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు కార్డెన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టాయి. ఈ సమయంలోనే ఎదురుకాల్పులు జరిగాయి. మోర్గాంలోని ఓ ఇంటి వద్దకు వెళ్లిన సైన్యం, సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కాల్పులు జరిపారు. ఓ సైనికుడు మరణించాడు. ప్రిసల్‌ చిన్నాగంలో జరిగిన మరో భారీ ఎన్‌కౌంటర్లో సైన్యం నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టటగా ఓ సైనికుడు అమరుడయ్యాడు. ఈ రెండు చోట్లా గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. 

జమ్ము కశ్మీర్‌ రజౌరీ జిల్లాలో కాల్పులు

జమ్ము కశ్మీర్‌ రజౌరీ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక సైనికుడు గాయపడ్డాడు.గలూతి గ్రామంలో సెంట్రీ పోస్టులో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై తెల్లవారుజామున 4 గంటలకు ముష్కరులు కాల్పులకు తెగపడ్డారని అధికారులు తెలిపారు. సైన్యం, ఉగ్రవాదులకు మధ్య సుమారు అరగంట పాటు ఎదురుకాల్పులు జరిగాయని అధికారులు వెల్లడించారు. అయితే కాల్పులు జరుగుతుండగానే ఉగ్రవాదులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయారని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను తుదముట్టించడానికి అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

Tags:    

Similar News