జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికుల వీరమరణం

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికులు వీరమరణం పొందారు. మృతుల్లో ఒక సైనిక అధికారి ఉన్నారు. దోడా జిల్లాలోని దెస్సా అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

By :  Raju
Update: 2024-07-16 14:01 GMT

జమ్ముకశ్మీర్‌ దోడా జిల్లాలోని దెస్సా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య సోమవరం రాత్రి భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఆర్మీ అధికారి సహా నలుగురు సైనికులు అమరులయ్యారు. మరో జవాను గాయపడ్డారు. అడవిలోకి తప్పించుకుని పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నది. దెస్సా అటవీ ప్రాంతం వద్ద ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం అందింది. వారు సైనికులతో కలిసి తనిఖీలు చేశారు. ఈ క్రమంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఎదురుపడి కాల్పులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు ధీటుగా ఎదురుకాల్పులు జరిపాయి. కొద్దిసేపు కాల్పుల అనంతరం ముష్కరులు పారిపోవడానికి యత్నించారు. ఈ సమయంలో ఆర్మీ అధికారి, జవాన్లు వారి వెంట పడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో కెప్టెన్‌ బ్రిజేశ్‌ థాపా, నాయక్‌ డీ రాజేశ్‌, జవాన్‌లు బీజేంద్ర, అజయ్‌అమరులయ్యారు.

హెలీకాప్టర్ల ద్వారా భద్రతా బలగాలు అణువణువు జల్లెడ పడుతున్నారు. భారత ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేదీతో ఫోన్‌లో మాట్లాడిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దోడాలో పరిస్థితిపై సమీక్షించారు. జవాన్ల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రతిజ్ఞ చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో ఐక్యం కావాలని ప్రజలకు పిలునిచ్చారు. తమకు కచ్చితమైన సమాచారం ఇస్తే ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను తీవ్రతరం చేయవచ్చని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వీర జవాన్లకు ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి భయానక ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరగడం చాలా బాధాకరం, ఆందోళనకరం అని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఈ నిరంతర ఉగ్రదాడులు జమ్ముకశ్మీర్‌లోని దయనీయ స్థితిని వెల్లడిస్తున్నాయని చెప్పారు. బీజేపీ తప్పుడు విధానాల వల్ల సైనికులు వారి, కుటుంబాలు బలవుతున్నాయని రాహుల్‌ ఆరోపించారు.

గత నాలుగు నెలల్లో 22 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60 మంది విదేశీ ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఉన్నది. గత నెలలో భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించిన ప్రధాని ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను పటిష్టం చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులు పైచేయి సాధించవద్దని సూచించారు. 

Tags:    

Similar News