కోచింగ్‌ సెంటర్‌లోకి వరద నీరు.. ముగ్గురు విద్యార్థుల మృతి

ఢిల్లీలో శనివారం కురిసిన భారీ వానకు వరదనీరు పోటెత్తి ఓ భవనంలోని అడుగుభాగంలో నిర్వహిస్తున్న సివిల్‌ సర్వీస్ కోచింగ్‌ సెంటర్‌లోకి చొచ్చుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.

By :  Raju
Update: 2024-07-28 05:12 GMT

సెంట్రల్‌ ఢిల్లీలోని ఓల్డ్‌ రాజిందర్‌ నగర్‌లో దారుణం జరిగింది. ఢిల్లీలో శనివారం కురిసిన భారీ వానకు వరదనీరు పోటెత్తి ఓ భవనంలోని అడుగుభాగంలో నిర్వహిస్తున్న సివిల్‌ సర్వీస్ కోచింగ్‌ సెంటర్‌లోకి చొచ్చుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌ ఉన్న లైబ్రరీలో విద్యార్థులు చదువుకుంటున్న సమయంలో వరద ఒక్కసారిగా పోటెత్తిందని ప్రాథమికంగా తెలుస్తోంది.పలువురు విద్యార్థులను తాళ్ల సాయాంతో రక్షించారు. మృతులు తన్యా సోని (తెలంగాణ), శ్రేయా యాదవ్‌ (యూపీ), నవీన్‌ (కేరళ)గా గుర్తించారు.

7 గంటల ప్రాంతంలో రావ్‌ ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌ నీట మునిగిననట్లు తమకు ఫోన్‌ వచ్చినట్లు ఢిల్లీ అగ్నిమాపక విభాగం తెలిపింది. వెంటనే ఐదు అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలానికి చేరుకున్నామని, అడుగుభాగం పూర్తిగా జలమయమై ఉన్నట్లు పేర్కొన్నది. ఎన్డీఆర్‌ఎఫ్‌ చేపట్టిన సహాయక చర్యలతో ముగ్గురు విద్యార్థుల మృత దేహాలను వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనలో కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ ఎం హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశాం.. మా ఫోరెన్సిక్ బృందాలు ఇక్కడ ఉన్నాయి.. ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది.. దీనిపై సరైన విచారణ జరగాలనే దానికి కట్టుబడి ఉన్నాం. కేసు నమోదు చేసి నిజానిజాలు తేల్చేందుకు కట్టుబడి ఉన్నామని. ఇప్పటివరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

బేస్‌మెంట్‌లోకి భారీగా వరద వచ్చిందని అందులో కొంతమంది చిక్కకునే అవకాశం ఉన్నట్లు మాకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. భవనంలోని అడుగు భాగానికి వరద నీరు ఎలా వచ్చిందనేదానిపై మేము దానిపై దర్యాప్తు చేస్తున్నాం. అడుగు భాగంలోకి వేగంగా వరద వచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ కారణంగానే కొంతమంది అందులో చిక్కుకున్నారని తెలిపారు. 

కోచింగ్‌ సెంటర్‌ ఘటనపై ఆప్‌ పాలనపై బీజేపీ విమర్శలు గుప్పించింది. స్థానిక ఎమ్మెల్యే డ్రైనేజీని శుభ్రం చేయించకపోవడంతో ప్రమాదం జరిగిందని ఆరోపించింది.మరోవైపు ఘటనపై నివేదిక ఇవ్వాలని మంత్రి అతిశీ సీఎస్‌ను ఆదేశించారు. ఘటన ఎలా జరిగిందో మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించినట్లు ఎక్స్‌ వేదికగా తెలిపారు.

Tags:    

Similar News