వీధి కుక్కల దాడిలో 18 నెలల బాలుడి మృతి

వీధి కుక్కల దాడికి మరో చిన్నారి ప్రాణాలు బలయ్యాయి.ఈ హృదయ విదారక ఘటన జవహర్‌నగర్‌లో జరిగింది.

By :  Raju
Update: 2024-07-17 06:30 GMT

వీధి కుక్కల దాడికి మరో చిన్నారి ప్రాణాలు బలయ్యాయి. అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మరవకముందే 18 నెలల చిన్నారిపై వీధికుక్కలు విచరణారహితంగా దాడి చేసి చంపేశాయి. ఈ హృదయ విదారక ఘటన జవహర్‌నగర్‌లో జరిగింది.

సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి గ్రామానికి చెందిన లక్ష్మీ, భరత్‌ దంపతులు జవహర్‌నగర్‌లోని ఆదర్శ్‌ నగర్ లో ఉంటున్నారు. వారికి ఏడాదిన్నర ఏళ్ల కొడుకున్నాడు. 18 నెలల విహాన్‌ మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అతని తండ్రి బైటికి వెళ్లగా, తల్లి ఏదో పనిలో నిగమ్నమై ఉండగా వీధికుక్కలు చిన్నారిపై ఎగపడ్డాయి. విచక్షణా రహితంగా దాడి చేశాయి. చిన్నారి శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు కొరికి పడేశాయి. అంతటితో ఆగకుండా కొంతదూరం బాలుడిని ఈడ్చుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకున్నది.

వీధి కుక్కల దాడి అంశాన్ని హైకోర్టు సుమోటా స్వీకరించి ఇటీవల జీహెచ్‌ఎంసీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని హెచ్చరించింది. అయినా పరిస్థితిలో ఏ మార్పు రాలేదు. వారంలో ఏదో ఒక చోట వీధి కుక్కల దాడుల బారిన పెద్దలు, చిన్నారులు పడుతున్నారు. ఈ దాడుల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. వీధి కుక్కలను కట్టడి చేయడానికి జీహెచ్‌ఎంసీ తీసుకుంటున్న చర్యలపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.

ఈ ఘటన కలిచి వేసింది: సీఎం

హైదరాబాద్​ లోని జవహర్ నగర్ లో వీధి కుక్కలు దాడి చేసి రెండేళ్ల బాలుడిని చంపేసిన ఘటనపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని అన్నారు. భ‌విష్య‌త్‌లో ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నందున వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప‌సి కందులు, చిన్నారులపై ప్ర‌తి ఏటా వీధి కుక్క‌ల దాడులకు వాతావ‌ర‌ణ ప‌రిస్థితులా, లేక సీజ‌న‌ల్ కార‌ణాల అనే అంశంపై అధ్యయనానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. వీధి కుక్కలకు టీకాలు వేయటం, లేదా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో కుక్కలు దాడులు చేస్తే తక్షణం అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యా రోగ్య శాఖను సీఎం ఆదేశించారు. ఇలాంటి సంఘటనలను నివారించడానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని బస్తీలు, కాలనీలు, సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.

Tags:    

Similar News