గడికో మాట.. గందరగోళం

గ్రూప్స్‌, డీఎస్సీపై సీఎం మాటలు చూస్తే ఆయన దేనిపై అధ్యయనం చేసినట్టుగాని, సంబంధితవర్గాల నుంచి సమాచారం తీసుకున్నట్టుగాని, అసలు సమస్య ఏమిటో అర్థం చేసుకున్నట్టు గాని అనిపించదు.

By :  Raju
Update: 2024-07-13 13:11 GMT

అబద్ధాలు అంగీ లాగు తొడిగితే అది రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు. జేఎన్‌టీయూలో నిర్వహించిన నాణ్యమైన ఇంజినీరింగ్‌ విద్య కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అక్కడ ఏ ఉద్దేశంతో కార్యక్రమం పెట్టారో దానికి సంబంధం లేకుండా రాజకీయాలు మాట్లాడటం రేవంత్‌రెడ్డికి మొదటి నుంచి అలవాటు. ఇంజినీరింగ్‌ విద్య గురించి నాలుగు మాటలు చెప్పి అసలు విషయాన్నిపక్కనపెట్టి రాష్ట్రంలో రేవంత్‌ ప్రభుత్వాన్ని కలవరపెడుతున్న నిరసనలు, ఆందోళనలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

'గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించాం. నోటిఫికేషన్ లో లేనివిధంగా 1:100 పిలిస్తే కోర్టులో మళ్లీ ఇబ్బందులు వస్తాయి. 1:100 పిలిస్తే మళ్లీ గ్రూప్‌-1 మొదటికి వస్తుంది. రెండేళ్ల కిందట ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ పరీక్షను వాయిదా వేయాలంటున్నారు. వాయిదాల వల్ల రాజకీయ నిరుద్యోగులు, కోచింగ్‌ సెంటర్లకు లాభం. పరీక్షలు రాయని వారు వాయిదా వేయాలని కోరుతున్నారు. మార్చి 31 లోపు ఖాళీలు తెప్పించి జూన్‌ 2 లోపు నోటిఫికేషన్లు ఇస్తాం. డిసెంబర్‌ 9 లోపు ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్‌ క్యాలెండర్‌ తీసుకొస్తున్నాం. విద్యా సంస్థలు రాజకీయ పునరావస కేంద్రాలుగా మారకూడదు.' ఇవీ సీఎం మాట్లాడిన మాటలు.

ఇందులో ఎన్ని అబద్ధాలు ఉన్నాయంటే గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 పిలిస్తే కోర్టులో ఇబ్బందులు వచ్చి మళ్లీ మొదటికి వస్తుందట. ప్రభుత్వం దీనిపై నిపుణులు, కనీసం వారి అడ్వకేట్‌ జనరల్‌తో కూడా చర్చించలేదు. కానీ సీఎం ఢిల్లీలోనే దీనిపై ప్రకటన చేశారు. అధికారికంగా దీనిపై సమీక్ష చేయలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనుకుంటే దానికి ఉండే అడ్డంకులను అధిగమించడం పెద్ద సమస్య కాదు. కానీ కాంగ్రెస్‌ వాళ్లే గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడానికి సిద్ధం లేకుండా కోర్టులు, సాంకేతిక సమస్యల పేరుతో విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం పదే పదే చేస్తున్నది. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమవుతుందని రేవంత్‌ సహా ఆపార్టీ నేతలు భావిస్తున్నారు.

ఇక రెండేళ్ల కిందట ఇచ్చిన నోటిఫికేషన్‌ డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారట. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌కు పరీక్ష షెడ్యూల్‌ ఇచ్చి ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఆ పరీక్ష ను నిర్వహించి కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మొదటి క్యాబినెట్‌లోనే మెగా డీఎస్సీకి ఆమోదం తెలుపుతుందని నిరుద్యోగులు ఆశించారు. కానీ వారిని దగా చేసి గత నోటిఫికేషన్ రద్దు చేసి దానికి కొన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ మధ్యలోనే టెట్‌ కూడా నిర్వహించింది. టెట్‌కు, డీఎస్సీకి మధ్య కనీసం 45 రోజుల వ్యవధి ఉండాలన్న నిబంధన ఒకటి ఉంటుందిని ఈ ప్రభుత్వానికి తెలియదు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, పెట్టిన పరీక్షలకు ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు ఇచ్చి అది మా ఘనత అంటారు.

ఆ మధ్య జాబ్‌ క్యాలెండర్‌ ఏమైంది సారు అంటే ఇప్పటికే ఇచ్చామన్నారు. ఇప్పుడేమో మార్చి 31 లోపు ఖాళీలు తెప్పించి ..జూన్‌ 2 లోపు నోటిఫికేషన్లు ఇచ్చి.. డిసెంబర్‌ 9 లోపు ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్‌ క్యాలెండర్‌ తీసుకొస్తున్నాం అంటారు. సీఎం మాటలు చూస్తే ఆయన దేనిపై అధ్యయనం చేసినట్టుగాని, సంబంధితవర్గాల నుంచి సమాచారం తీసుకున్నట్టుగాని, అసలు సమస్య ఏమిటో అర్థం చేసుకున్నట్టు గాని అనిపించదు. అందుకే నోటిఫికేషన్లు, పరీక్షలపై పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఈ పరిణామాలు సీఎం ఆందోళనకు అద్దం పడుతున్నాయని అంటున్నారు. అందుకే సీఎం రోజుకో మాట మాట్లాడుతున్నారని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. 

Tags:    

Similar News