18వ లోకసభకైనా డిప్యూటీ స్పీకర్ ఉంటడా?

డిప్యూటీ స్పీకర్‌ లేకుండానే 17వ లోక్ సభ ముగిసింది. 18వ లోక్‌సభ కైనా డిప్యూటీ స్పీకర్ ఉంటడా అనే చర్చ జరుగుతున్నది.

By :  Raju
Update: 2024-06-25 04:56 GMT

ఇప్పటివరకు 17 లోక్‌సభ సమావేశాలు జరిగాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా 17వ లోక్ సభ డిప్యూటీ స్పీకర్‌ లేకుండానే ముగిసింది. సంఖ్యాబలం సంపూర్ణంగా ఉండటంతో బీజేపీ డిప్యూటీ స్పీకర్‌ లేకుండా స్పీకర్‌, ప్యానల్‌ స్పీకర్లతోనే ఐదేళ్లు సభను నడిపించింది. ఈ సారి బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోవడం, భాగస్వామ్యపక్షాల మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే ప్రతిపక్షం కూడా బలంగా ఉన్నది. గత సంప్రదాయాలకు అనుగుణంగా స్పీకర్‌ పదవి అధికారపార్టీ తీసుకుంటే డిప్యూటీ స్పీకర్‌ పదవి ప్రతిపక్షాలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. 18వ లోకసభ కైనా డిప్యూటీ స్పీకర్ ఉంటాడా? అనే చర్చ మొదలైంది.

లోక్‌సభ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమం కొనసాగుతున్నది. నిన్న 262 మందితో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇవాళ మిగిలిన వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తెలంగాణ ఎంపీలు మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్‌ ఎంపీల ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. అనంతరం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్‌ కార్యక్రమం ప్రారంభమౌతుంది. ఈనెల 26న స్పీకర్‌ ఎన్నిక పూర్తవుతుంది. రాజ్యసభ సమావేశాలు కూడా 27నుంచి ప్రారంభకానున్నాయి. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు.

మరోవైపు స్పీకర్‌ పదవిపై ఉత్కంఠ కొనసాగుతున్నది. సంఖ్యాబలం పరంగా ఎన్డీఏకు లోక్‌సభలో తగినంత మెజారిటీ ఉన్నది. కానీ బీజేపీకి సొంతంగా మెజారిటీ లేకపోవడంతో స్పీకర్‌ అభ్యర్థి ఎంపిక క్లిష్టంగా మారింది. ఆ పదవికి ఓం బిర్లాను మరోసారి ఎన్నుకోవడానికి తమ భాగస్వామ్యపక్షాలతో ఆ పార్టీ నేతలు చర్చించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అయితే చర్చల వివరాలు, ప్రస్తావనకు వచ్చిన పేర్లను వెల్లడించానికి వారు నిరాకరించారు. ఎన్టీఏ వైఖరి బట్టే స్పీకర్‌ పదవికి పోటీ పడాలా? లేదా అనేది నిర్ణయిస్తామని పలువురు విపక్ష నేతలు అంటున్నారు. ఏకాభిప్రాయం ద్వారా స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులను అధికార, ప్రతిపక్షాలు తీసుకోవడం సంప్రదాయమన్నారు.

ఈ నేపథ్యంలో స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులపై ఏకాభిప్రాయం కోసం ప్రతిపక్షాలతో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ చర్చిస్తున్నారు. ఏకాభిప్రాయం కుదురుతుందా లేదా అన్నది చర్చల తర్వాత తేలుతుంది. మరోవైపు ఎన్డీఏ స్పీకర్‌ అభ్యర్థి ఖారారయ్యాకే తమ అభ్యర్థి ఎవరు అన్నది నిర్ణయిస్తామని విపక్ష నేత ఒకరు తెలిపారు. అదే జరిగితే ఓటింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. లోక్‌సభలో ఎన్డీఏకు 293 మంది ఎంపీలు, ఇండియా కూటమికి 234 మంది సభ్యులున్న సంగతి తెలిసిందే.  

Tags:    

Similar News