నిరుద్యోగులు చస్తేనే నోటిఫికేషన్లు ఇస్తారా?: మోతీలాల్‌

నిరుద్యోగ డిమాండ్ల సాధన కోసం తొమ్మిది రోజులుగా గాంధీ ఆస్పత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థి సంఘం నాయకుడు మోతీలాల్‌ నాయక్‌ మంగళవారం దీక్ష విరమించాడు. నిరుద్యోగులు చనిపోతేనే ఈ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుందా? ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు.

By :  Raju
Update: 2024-07-02 06:07 GMT

సులీల్‌ నాయక్‌, శ్రీకాంత్‌ చారీలా తాను కూడా చనిపోతేనే ఈ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుందా? ఇదేనా ప్రజాపాలన అని విద్యార్థి సంఘం నాయకుడు మోతీలాల్‌ నాయక్‌ ప్రశ్నించారు. నిరుద్యోగ డిమాండ్ల సాధన కోసం తొమ్మిది రోజులుగా గాంధీ ఆస్పత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న ఆయన మంగళవారం దీక్ష విరమించాడు. తన దీక్షకు మద్దతుగా నిలిచి వారందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. ఇక రేపటి నుంచి ప్రత్యక్ష కార్యాచరణ చేపడుతామన్నాడు.

దీక్ష విరమణ అనంతరం మోతీ లాల్‌ మాట్లాడుతూ.. ఒకరు చచ్చిపోతేనే ఈ ప్రభుత్వం స్పందిస్తుందా? ఒక సులీల్‌ నాయక్‌, ఒక శ్రీకాంత్‌ చారీలా చనిపోతేనే మీరు ఉద్యోగాలు ఇస్తారా? అని ప్రశ్నించాడు. ప్రభుత్వం మారితే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశించారు. తాను స్వయంగా వివిధ యూనివర్సిటీలు తిరిగి, విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం కృషి చేశాను. ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని, ఎన్నికల మ్యానిఫెస్టో చెప్పిన తేదీల ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మొదటి క్యాబినెట్‌లోనే మెగా డీఎస్సీ అన్నారు. కానీ ఈ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యను పక్కనపెట్టి ఫిరాయింపులపై దృష్టి సారించింది.

తమ సమస్యలను పరిష్కరించాలని నిరుద్యోగులు ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరిగినా స్పందన లేదు. 2000 మందికిపైగా నిరుద్యోగ అభ్యర్థులు ఇందిరాపార్క్‌ వద్ద నిరసన చేపట్టినా పట్టించుకోలేదు. దీంతోనే నేను కలత చెంది నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టాను. ఆర్ట్స్‌ కాలేజీ ముందు ఆమరణ దీక్ష చేస్తాను అంటే టెంట్‌ వేయనీయలేదు. పద నిమిషాల నిరసనకు కూడా పర్మిషన్‌ ఇవ్వలేదు. గత ప్రభుత్వ హయాంలో రోజుంతా దీక్ష చేస్తే ఎవరూ అడ్డుకోలేదు. ఇదేనా ప్రజా పాలన అని మోతీలాల్‌ ప్రశ్నించాడు. తొమ్మిది రోజులుగా ఒక వ్యక్తి మంచినీళ్లు ముట్టుకోకుండా ఆమరణ దీక్ష చేస్తుంటే వచ్చి మాట్లాడటం ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అవుతుంది. కానీ పట్టించుకోకుండా, చచ్చిపోయినా ఫరవాలేదు మాకు సంబంధం లేదన్నట్టు రేవంత్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది? ఇదా ప్రజాపాలన అని ప్రశ్నించాడు.

గ్రూప్‌-1 మెయిన్స్‌ 1: 100 అవకాశం కల్పించాలి. గ్రూప్‌ -2లో 2000 పోస్టులు, గ్రూప్‌-3 లో 3000 పోస్టులు పెంచాలని, డీఎస్పీ వాయిదా వేసి 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని మోతీలాల్‌ డిమాండ్‌ చేశాడు. వాళ్లు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు కాదు, ఇప్పటివరకు 30 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. దీన్నిబట్టి నిరుద్యోగులకు ఏం అండగా నిలబడినట్టు అన్నాడు. వాస్తవానికి గత ప్రభుత్వం హయాంలో నీళ్లు వచ్చాయి. రోడ్లు బాగుపడ్డాయి. రైతులంతా సంతోషంగా ఉన్నారు. కానీ మా ముఖాలు చూసి ఓట్లు వేస్తే మా ఈ ప్రభుత్వం నిరుద్యోగులు ఆమరణ దీక్షలు చేసే స్థితికి తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News