చంపేయీ బీజేపీలో చేరుతారా? సొంత పార్టీ పెడుతారా?

చంపేయీ జేఎంఎం వీడటం ఖాయమనేది తేలుస్తున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌ కామెంట్స్‌.. కేంద్ర మంత్రి జీతన్‌ రామ్‌ మాంఝీ ట్వీట్‌

By :  Raju
Update: 2024-08-19 04:37 GMT

కొన్నినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఝార్ఖండ్‌ రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర మాజీ సీఎం,జేఎంఎం నేత చంపయీ సోరెన్‌ బీజేపీలో చేరుతారుతారని, ఆరుగురు ఎమ్మెల్యేలతో కలిసి అందుకే ఆయన హస్తినకు వెళ్లారని నిన్నంతా ప్రచారం జరిగింది.

చంపయీ సోరెన్‌ బీజేపీలో చేరుతారంటూ ఊహాగానాలనేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం హేమంత్‌ సోరెన్‌ చేసిన కీలక వ్యాఖ్యలు దానికి బలం చేకూరుస్తున్నాయి. ప్రజల్లో చీలిక తేవడానికి బీజేపీ యత్నిస్తున్నదని, డబ్బుతో ఎమ్మెల్యేలకు గాలం వేయడానికి ఆపార్టీ వెనుకాడబోదని ఆరోపించారు. చంపయీ బీజేపీలో చేరికపై కేంద్ర మంత్రి జీతన్‌ రామ్‌ మాంఝీ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. చంపయీ నువ్వు పులివి. నువ్వు పులిలాగే ఉండాలి. ఎన్డీఏ కూటమిలోకి స్వాగతం అంటూ పోస్ట్‌ పెట్టారు.

దీంతో చంపయీ కాషాయ కండువా కప్పుకోవడం ఖాయంగానే కనిపిస్తున్నది. అయితే ఎప్పుడు అనేదానిపై ఇప్పటికిప్పుడు స్పష్టత లేకపోయినా ఆయన నిన్న ట్విటర్‌ వేదికగా సుదీర్ఘ లేఖను ఒకటి విడుదల చేశారు. ఆ లేఖలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే ఆయన జేఎంఎంలో కొనసాగకపోవచ్చన్నది స్పష్టమౌతున్నది.

జేఎంఎంలో ఎన్నో అవామానాలు ఎదుర్కొన్నందు వల్లనే ప్రయత్నామ్నాయం కోసం చూడాల్సి వచ్చిందన్నారు. దీని కోసం తన ముందు మూడు మార్గాలున్నాయన్నారు. 'ఒకటి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగడం, రెండోది సొంతంగా పార్టీ పెట్టడం, చివరగా ఎవరైనా తోడుగా నిలిస్తే వారితో కలిసి పనిచేయడం ' ఇప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు నా ముందు ఈ మూడు మార్గాలున్నాయి అని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ స్ట్రాటజీ స్పష్టంగానే ఉన్నది. ఇప్పటికే సోరెన్‌ కుటుంబంలో చీలిక తెచ్చి శిబు సోరెన్‌ పెద్ద కోడలు సీతా సోరెన్‌ పార్టీలో చేర్చుకుని మొన్నటి దుమ్కా స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించింది. అయితే ఆమె ఓటమి పాలైంది. ఇప్పుడు చంపయీతో పార్టీ పెట్టించి ఆపార్టీతో కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. బీజేపీ అధిష్ఠానం ముందు జమ్ముకశ్మీర్‌, మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు సవాల్‌ నిలిచాయి. దీంతో ఇప్పటి నుంచే ఆ పార్టీ తన వ్యూహాలను అమలుచేస్తున్నది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ఇండియా కూటమి గెలిస్తే కష్టమనే భావన కమలనాథుల్లో ఉన్నది. అందుకే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచేడానికి చీలిక తేవడం లేదా, కీలక నేతలను పార్టీ నుంచి బైటికి తీసుకురావడం వంటి చర్యలు చేస్తున్నదనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చంపయీ సోరెన్‌ అంశం చర్చనీయాంశంగా మారింది. 

Tags:    

Similar News