లోక్ సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు?

డిప్యూటీ స్పీకర్‌ పదవిని దక్కించుకోవడానికి బీజేపీ పావులు కదుపుతున్నది. ఇండియా కూటమికి కాకుండా ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలకు చెందిన నేతనే ఎన్నుకోవాలని యోచిస్తున్నది. అది ఎవరన్నది త్వరలో అధికార ప్రకటన వెలువడనున్నది.

By :  Raju
Update: 2024-06-27 13:35 GMT

స్పీకర్‌ పదవిని మూజువాణి ఓటుతో కైవసం చేసుకున్న ఎన్డీఏ డిప్యూటీ స్పీకర్‌ పదవినీ దక్కించుకోవాలని యోచిస్తున్నది. 2014, 2019లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడం, విపక్షాలకు సభలో తగినంత బలం లేకపోవడంతో స్పీకర్‌ పదవి కోసం పోటీ పడలేదు. కానీ ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం సభా సంప్రదాయాలు పాటించాలని విపక్షం కోరింది. డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇండియా కూటమికి ఇస్తే స్పీకర్‌ పదవి ఏకగ్రీవం కావడానికి సహకరిస్తామని చెప్పింది. దీనికి బీజేపీ అంగీకరించలేదు. ఎన్డీఏ కూటమి తరఫున నిలబడిన ఓం బిర్లాకు పోటీగా ఇండియా కూటమి కె. సురేశ్‌ను పోటీలో నిలిపింది. దీంతో 46 ఏళ్ల తర్వాత స్పీకర్‌ పదవి కోసం ఎన్నిక జరిగిన విషయం విదితమే.

ఇండియా కూటమి పోటీలో నిలుపడానికి ప్రధాన కారణం డిప్యూటీ స్పీకర్‌ పదవే. కానీ బీజేపీ బెట్టు వీడకపోవడంతో తమ బలాన్ని చాటడానికి యత్నించింది. ఇండియా కూటమి గతంలో కంటే బాగా బలం పుంజుకున్నది. మరోవైపు బీజేపీ భాగస్వామ్యపక్షాల మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో స్పీకర్‌ పదవి కోరిన జేడీయూ, టీడీపీలతో పాటు మిగతా భాగస్వామ్యపక్షాలతో చర్చించింది. అనంతరం కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ కూడా ఇండియా కూటమి నేతలతో మాట్లాడారు. అప్పుడే డిప్యూటీ స్పీకర్‌పై విపక్ష నేతలు కండీషన్స్‌ పెట్టారు. దీంతో స్పీకర్‌ పదవి కోసం అనివార్యంగా పోటీ జరిగింది. బుధవారం జరిగిన పోటీలో విపక్ష అభ్యర్థి సురేశ్‌పై ఓం బిర్లా గెలిచారు.

ఇప్పుడు డిప్యూటీ స్పీకర్‌ పదవిని దక్కించుకోవడానికి బీజేపీ పావులు కదుపుతున్నది. ఇండియా కూటమికి కాకుండా ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలకు చెందిన నేతనే ఎన్నుకోవాలని యోచిస్తున్నది. అది ఎవరు అన్నది త్వరలో అధికార ప్రకటన వెలువడనున్నది. 2014లో స్పీకర్‌గా సుమిత్రా మహాజన్‌, ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న అన్నాడీఎంకేకు చెందిన తంబిదొరై డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్‌ లేకుండానే 17 లోక్‌సభ ముగిసింది. ఇప్పుడు మళ్లీ డిప్యూటీ స్పీకర్‌ పదవి తెరమీది వచ్చింది. సంఖ్యాపరంగా డిప్యూటీ స్పీకర్‌ పదవిని కూడా ఎన్డీఏ దక్కించుకునే అవకాశాలున్నాయి. కానీ స్పీకర్‌ పదవిని ఆశించిన జేడీయూ, టీడీపీల నుంచి కాకుండా వేరే ఎవరినైనా ఎన్నుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నదా? అలాంటి పరిస్థితే వస్తే ఎన్డీఏ కూటమిలోనే ఆ పోస్టుకు పోటీ పడే సంఖ్య ఎక్కువగా ఉంటే అప్పుడు బీజేపీ ఎలా వ్యవహరిస్తుందనే చర్చ నడుస్తున్నది.

Tags:    

Similar News