అమలవుతున్నవే 'గ్యారెంటీ'

ఈ ఏడాదంతా ఆరు గ్యారెంటీల అమలు మాటల్లోనే ఉంటుంది తప్పా ఆచరణలో అమలు కావని బడ్జెట్‌ కేటాయింపులను చూస్తే తెలుస్తోంది.

By :  Raju
Update: 2024-07-25 08:23 GMT

ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీల హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ వందరోజుల్లోనే వాటిని అమలు చేస్తామని చెప్పింది. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు 1. మహాలక్ష్మి: మహిళలకు ప్రతీ నెల రూ. 2500 రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం 2. రైతు భరోసా: ఏటా రైతులకు, కౌలు రైతులకూ ఎకరానికి రూ. 15000 వ్యవసాయ కూలీలకు రూ.12000 వరి పంటకు రూ.500 బోనస్ 3. గృహ జ్యోతి:ప్రతి కుటుంబానికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 4. ఇందిరమ్మ ఇండ్లు: ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, రూ. 5 లక్షలు ఉద్యమకారులకు 250 చ.గ. ఇంటి స్థలం 5. యువ వికాసం: విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్, 6. చేయూత: రూ. 4000 నెల వారీ పింఛను (పెన్షన్) రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అమలు చేస్తామని చెప్పారు.

అయితే ఇవాళ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వాటికి చేసిన కేటాయింపులు చూస్తే పథకాలన్నీ ప్రతిపాదనల్లోనే.. సంప్రదింపుల్లోనే ఉన్నాయని స్పష్టమౌతుంది. రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రూ. 723 కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ. 2,418కోట్లు నిధులు మంజూరు చేసింది.

ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టో అంశాలను పేర్కొంటూ మాటలు కోతలు దాటించిన రేవంత్‌ అండ్‌ కో బడ్జెట్‌ కేటాయింపుల వచ్చే సరికి చేతలు గడప దాటలేదని స్పష్టమౌతున్నది. ఏడు నెలల పాలనలో అస్తవ్యవస్థ నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని అడుగుతున్నారు. అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పిన అధికారపార్టీ ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి విపక్షాలు వాయిదా తీర్మానాలు ఇస్తే స్పీకర్‌ తిరస్కరిస్తారు.

ముఖ్యంగా బడ్జెట్‌ ప్రసంగంలో డిప్యూటీ సీఎం చెప్పిన అంశాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. దుబారా తగ్గించామన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని వివరించారు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు, పింఛన్లు చెల్లిస్తున్నామని పెద్ద అబద్ధం చెప్పారు. రైతు భరోసా ఇవ్వలేదు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఇస్తామన్న రూ. 2500, నిరుద్యోగ భృతి అమలు కాలేదు. రూ. 4000 పింఛన్‌ ఇస్తామన్న హామీకి అతీగతీ లేదు. బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలకు చేసిన కేటాయింపులు చూస్తే కోతలే తప్పా కొత్తగా లబ్ధి దారులకు ఎవరికీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి, నియామకాల్లో పారదర్శకత చర్యలు, త్వరలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన అని నిరుద్యోగుల ఆశలపై భట్టి బడ్జెట్‌లో నీళ్లు చల్లారు. గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలే ఈ ఏడాది చివరి వరకు జరగనున్నాయి. మార్చి 31 వరకు ఉన్న ఖాళీలను తీసుకుని, నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్‌ 9 నాటికి ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం చెప్పారు. కానీ బడ్జెట్‌లో మాత్రం పోస్టుల పెంపు, కొత్త ఉద్యోగాల అంశం, జాబ్‌ క్యాలెండర్‌ పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అలాగే వ్యవసాయ కూలీలకు ఈ ఏడాది నుంచే రూ. 12,000 ఇస్తామని భట్టి బట్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. కానీ అవి ఎక్కడి నుంచి ఇస్తారన్నది స్పష్టం గా చెప్పలేదు. ఉద్యమకారులకు 250 చ. గ నివాస స్థలం గురించి ప్రస్తావన లేదు. ఆరు గ్యారెంటీల్లోని 13 అంశాల్లో గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి పథకానికి మాత్రమే నిధుల కేటాయింపు ప్రతిపాదనలు ఉన్నాయి. కానీ మిగిలిన వాటి అమలుకు సంబంధించిన ప్రకటనపై, నిధుల కేటాయింపుపై ఎలాంటి క్లారిటీ లేదు. దీన్నిబట్టి ఈ ఏడాదంతా ఆరు గ్యారెంటీల అమలు మాటల్లోనే ఉంటుంది తప్పా ఆచరణలో అమలు కావని బడ్జెట్‌ కేటాయింపులను చూస్తే తెలుస్తోంది. 

Tags:    

Similar News