కోదండరామ్, ఆకునూరి మురళి ఎక్కడ?

ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ.. కొన్నిరోజులుగా చిక్కపడి లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు

By :  Raju
Update: 2024-07-02 04:39 GMT

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులను రెచ్చగొట్టిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, ఆకునూరి మురళి, తీన్మార్‌ మల్లన్న, బల్మూరి వెంకట్‌ ఇప్పుడు ఎక్కడికి పోయారని గాంధీ ఆస్పత్రి వద్ద విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ.. కొన్నిరోజులుగా చిక్కపడి లైబ్రరీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.

ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘం నేత మోతీలాల్‌ నాయక్‌ ఆమరణ దీక్షపై స్పందించడం లేదు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని, గ్రూప్‌ 2, 3 పోస్టులు పెంచాలని, గ్రూప్‌-1 మెయిన్స్‌ కు 1: 100 చొప్పున అవకాశం కల్పించాలన్న విద్యార్థుల డిమాండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. కేసీఆర్‌ కుటుంబంలో నలుగురి ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్న తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్న అంశాలపై నిర్ణయం తీసుకోవాలంటే సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నంటున్న ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం వాదన అసంబద్ధంగా ఉన్నది. ఎందుకంటే ఎన్నికల సమయంలోనే మీడియా ప్రతినిధులు కాంగ్రెస్‌ ఇస్తున్న హామీలపై ప్రశ్నిస్తే దీనిపై తాము పూర్తి కసరత్తు చేశామని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని, పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాతే హామీలపై స్పష్టమైన ప్రకటన చేశామని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఏడు నెలల కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలు చూస్తుంటే అవన్నీ నీటి మాటలే అని అర్థమౌతున్నది. అబద్ధాలు చెప్పి అయినా అధికారంలోకి రావాలన్నదే కాంగ్రెస్‌ రహస్య అజెండా అని ఇప్పుడు తేటతెల్లమవుతున్నది.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, ఆకునూరి మురళి లాంటి వాళ్లు ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ మారితే వెంటపడుతామని హెచ్చరించిన విషయాన్ని ఇప్పుడు చాలామంది గుర్తు చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ అంశంపై, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై మాట్లాడిన వాళ్లు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగాల భర్తీకి ప్రక్రియను అడ్డుకొని, గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ కోర్టుల్లో కేసులు వేసింది నిజం కాదా? అప్పుడు వీటిపై ప్రెస్‌మీట్లు పెట్టి, యూట్యూబ్‌ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్న వీళ్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు, ఉద్యోగ నియామక పత్రాలు అందుకుని పోస్టింగ్‌ల కోసం విజ్ఞప్తి చేస్తూ.. సీఎం ఇంటి ముందు మోకాళ్లపై నిలబడినా కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి మా ప్రభుత్వ ఘనత చెప్పుకుని లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకున్న రేవంత్‌ ప్రభుత్వం ఇప్పుడు వీటిపై స్పందించకపోగా.. నిరుద్యోగులకు అండగా ఉంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నది. ప్రశ్నిస్తున్న నిరుద్యోగులపై కేసులు పెడుతూ బెదిరిస్తున్నది. ప్రజా పాలన అంటే ఇదేనా? మేధావులు సమాధానం చెప్పాలంటున్నారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రెలు అయినట్టు రేవంత్‌ ప్రభుత్వ తీరు ఉన్నదని నిరుద్యోగులు వాపోతున్నారు.

Tags:    

Similar News