డిఫెన్స్‌ లో పడ్డప్పుడల్లా సీఎం తప్పుడు అంశాలు లేవనెత్తుతున్నరు

మీడియాతో చిట్ చాట్‌ లో మాజీ మంత్రి హరీశ్‌ రావు

Update: 2024-07-29 12:25 GMT

అసెంబ్లీలో ప్రభుత్వం డిఫెన్స్‌ లో పడ్డప్పుడల్లా సీఎం రేవంత్‌ రెడ్డి తప్పుడు అంశాలు లేవనెత్తుతూ సభను పక్కదారి పట్టిస్తున్నారని, ప్రతి సమావేశంలోనూ ఇదే జరుగుతుందని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. అసెంబ్లీ లాబీల్లోని ఎల్వోపీ (లీడర్‌ ఆఫ్‌ అపోజిషన్‌) చాంబర్‌ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో చిట్‌ చేశారు. సభానాయకుడు ఆదర్శంగా ఉండాలని, కానీ సభలో సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. గత సమావేశాల్లోనూ మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యం కాదని రిటైర్డ్‌ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఇచ్చినా కేసీఆర్‌ పట్టించుకోలేదని అబద్దాలు చెప్పారని, రిటైర్డ్‌ ఇంజనీర్ల నివేదిక ఒకలా ఉంటే సీఎం మరోలా మాట్లాడారని అన్నారు. శనివారం సభలో విద్యుత్‌ మీటర్ల మీద తప్పుడు పత్రంతో సభను తప్పుదోవ పట్టించారని అన్నారు. తనకు కావాల్సిన వాఖ్యం చదివి మిగతా పదాలు వదిలేశారన్నారు. సీఎంపై తాము సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదని, ఉదయ్‌ స్కీంలో భాగంగా చేసుకున్న గతంలో ఎప్పుడో చేసుకున్న ఒప్పందాన్ని చదివి సభను, ప్రజలను భ్రమింపజేసే ప్రయత్నం చేశారని తెలిపారు.




 అప్పుడు మేం మంత్రులమే కాదు

పోతిరెడ్డిపాడు విస్తరణపై వైఎస్‌ ప్రభుత్వం జీవో ఇచ్చినప్పుడు తాము పదవుల కోసం పెదవులు మూసుకున్నామని రేవంత్‌ తమపై ఆరోపణలు చేశారని అన్నారు. అసలు ఆ జీవో వచ్చినప్పుడు తాము మంత్రులమే కాదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి బీఆర్‌ఎస్‌ వైదొలగడానికి ఉన్న కారణాల్లో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ విస్తరణకు ప్రయత్నించడం కూడా ఒక కారణమన్నారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్‌ రెడ్డేనన్నారు. తానేదో తెలంగాణ చాంపియన్ అయినట్టు రేవంత్ మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే తాము రాజీనామా చేశామని, రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా లేఖ కూడా ఇవ్వలేదన్నారు. రేవంత్‌ లాంటి వాళ్లు రాజీనామా చేయకుంటేనే విద్యార్థులు, యువత బలిదానాలు జరిగాయన్నారు. ఆ రోజు అమరవీరులు రాసిన లేఖలు చూస్తే వారి బలిదానాలకు కారకులెవరో తెలిసిపోతుందన్నారు. కేసీఆర్‌ లాగా రాజీనామాలు, త్యాగాలు చేసిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో ఇంకెవరికైనా ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ దీక్షతోనే తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు. 14 ఏండ్ల ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో రేవంత్‌ తెలంగాణ కోసం పని చేయనే లేదన్నారు. కేసీఆర్‌ తెలంగాణ సాధించకపోతే చంద్రబాబుతోనే రేవంత్‌ రెడ్డి ఉండేవారన్నారు. తెలంగాణ ఉద్యమకారులపైకి రైఫిల్‌ బయల్దేరిన రేవంత్‌ రెడ్డి ఈ రోజు తానే తెలంగాణ చాంపియన్‌ అని చెప్పుకోవడం అంటే దెయ్యాలు వేదాలు వళ్లించినట్టుగా ఉందన్నారు. రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడైనా, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా అది కేసీఆర్‌ తెలంగాణ తెచ్చిన పుణ్యమేనన్నారు.



ఎల్‌ఆర్‌ఎస్‌ గురించి రేవంత్‌ అప్పుడు ఏం మాట్లాడారు.. ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి, భట్టి, ఉత్తమ్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ ను ఫీజులు లేకుండా అమలు చేయాలని అప్పుడు డిమాండ్‌ చేశారని, ఇప్పుడు చార్జీల వసూళ్లకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీకి, ఈ ప్రభుత్వానికి అన్ని ద్వంద్వ ప్రమాణాలే అన్నారు. బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని రేవంత్‌ అంటున్నారని, గతంలో కాంగ్రెస్‌ కు దేశంలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని, అంటే ఆ పార్టీ పని అయిపోయినట్టేనా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 18 రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలువలేదన్నారు. 28 పార్టీలతో ఇండియా కూటమి ఏర్పడతే కాంగ్రెస్‌ పార్టీ 99 ఎంపీ సీట్లు గెలుచుకుందన్నారు. జైపాల్‌ రెడ్డి పెద్ద తెలంగాణవాది.. తాను చిన్న తెలంగాణవాది అని రేవంత్‌ మాట్లాడుతున్నారని, ఆ రోజు తెలంగాణ కోసం 36 పార్టీలను ఒప్పించింది కేసీఆరా.. లేక జైపాల్‌ రెడ్డినా చెప్పాలన్నారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమన్న వాతావరణ ఏర్పడిన తర్వాతే రేవంత్‌ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారన్నారు. ఇప్పటికే రేవంత్‌ సభను తప్పుదోవ పట్టించేలా మూడుసార్లు మాట్లాడారన్నారు. రేవంత్‌ అబద్ధాలను మీడియా ఎండగట్టాలన్నారు. రుణమాఫీపై రేవంత్‌ ది గోబెల్స్‌ ప్రచారమన్నారు. రూ.31 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి బడ్జెట్‌ లో రూ.25 వేల కోట్లు మాత్రమే పెట్టారన్నారు.

Similar News