అక్కడ పవన్‌కు ఇస్తున్న గౌరవం ఇక్కడ భట్టికేది?

ఏపీలోని అన్నిప్రభుత్వ కార్యాలయాల్లో కనిపిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ల ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియా వైరల్‌గా మారాయి. తెలంగాణలోనూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫొటోలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పెట్టాలని ఆయన అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు.

By :  Raju
Update: 2024-06-15 12:24 GMT

ఏపీలోని అన్నిప్రభుత్వ కార్యాలయాల్లో కనిపిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ల ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియా వైరల్‌గా మారాయి. తెలంగాణలోనూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫొటోలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పెట్టాలని ఆయన అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. అక్కడ భాగస్వామ్య పార్టీలకు ఇచ్చిన విలువ ఇక్కడ దశాబ్దాలుగా కాంగ్రెస్‌పార్టీలోనే కొనసాగుతున్న నేతలకు ఇవ్వడం లేదని భట్టి అనుచరులు సోషల్‌ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రులకు శాఖలు కేటాయించారు. జనసేన పవన్‌ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. శాఖల కేటాయింపు పూర్తికాగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టాలని ఆదేశించారు. కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పవన్‌ కల్యాణ్‌ కొనియాడిన బాబు అంతేస్థాయిలో ప్రాధాన్యం ఇచ్చారు. కూటమిలోని భాగస్వామ్యపార్టీ అధినేతకు చంద్రబాబు ఇచ్చిన గౌరవానికి పవన్‌ అభిమానుల్లోనే కాదు ప్రజల్లోనూ సంతోషం వ్యక్తమౌతున్నది. సీఎం, డిప్యూటీ సీఎంల ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియా వైరల్‌గా మారాయి. తెలంగాణలోనూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఫొటోలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పెట్టాలని ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే ఆయన అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. అక్కడ భాగస్వామ్యపార్టీలకు ఇచ్చిన విలువ ఇక్కడ దశాబ్దాలుగా కాంగ్రెస్‌పార్టీలోనే కొనసాగుతున్న నేతలకు ఇవ్వడం లేదని భట్టి అనుచరులు సోషల్‌ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణలో రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై కొత్త రాజకీయ చర్చకు దారితీస్తున్నది.

తెలంగాణ రాష్ట్రంలో ఏపీ కంటే భిన్నంగా రాజకీయ పరిస్థితులు ఉండటమే ఈ చర్చకు కారణం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ తర్వాత అధికారంలోకి వచ్చాక ప్రారంభంలో కాంగ్రెస్‌ గ్యారెంటీ అని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు నగరంలోని అన్ని ప్రధాన సర్కిళ్లలో కనిపించేవి. రానురాను రేవంత్‌రెడ్డి ఫొటోలు పెద్దగా, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రుల ఫొటోలో చిన్నగా మారిపోయాయి. కొన్నిరోజుల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ అంటే రేవంత్‌ అనేలా ఆయన ఒక్క ఫొటోనే పెద్దగా వేయడం మొదలైంది. రేవంత్‌ పదవీ బాధ్యతలు చేపట్టాకే దళితులపై వివక్ష చూపుతున్నారని, ఆయన సామాజికవర్గానికే పెద్దపీట వేస్తున్నారని సొంతపార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడు నెలల కాలంలో ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో కొన్నిసార్లు డిప్యూటీ సీఎం భట్టికి జరిగిన అవమానాన్నిఈ సందర్భంగా ఆయన అభిమానులు, అనుచరులు ఉదహరిస్తున్నారు. సీఎం పదవి కోసం రేవంత్‌తో పాటు భట్టి విక్రమార్క పోటీపడిన సంగతి తెలిసిందే. సీఎల్పీ లీడర్‌గా ఉన్న ఆయనకే సీఎం పీఠం దక్కుతుందని భావించారు. కానీ అధిష్ఠాన నిర్ణయంతో ఆయన డిప్యూటీ సీఎంకే పరిమితమయ్యారు. పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భట్టి విక్రమార్క సర్దుకుపోయారు. కానీ సీఎం భట్టితో తనకు ఎప్పటికైనా ఇబ్బందే అని భావించి ప్రభుత్వ ప్రకటనల్లో ఆయన ఫొటోలు కనిపించకుండా చేశారనే విమర్శలున్నాయి. గతంలో ప్రభుత్వ ప్రకటనలలో కేసీఆర్‌ ఫోటో పెద్దగా పెట్టడాన్ని ప్రశ్నించిన వాళ్లు దీనికి ఏం సమాధానం చెబుతారని సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. వీటికంటే పెద్ద విషాదమేమిటి అంటే గాంధీ, అంబేద్కర్‌, ఫూలె వంటి మహనీయుల సరసన రేవంత్‌ రెడ్డి ఫొటోలు పెట్టడం పరాకాష్ట అంటున్నారు.


ప్రగతిభవన్‌ ప్రజా భవన్‌గా మార్చామని, అక్కడి బారికేడ్లను బద్దలు కొట్టామని అసెంబ్లీలో సీఎం ఊదరగొట్టారు. కానీ ఆ ప్రజాభవన్‌లో సీఎం ఉండటం లేదు. డిప్యూటీ సీఎం భట్టికి ఆ భవనాన్ని కేటాయించి తాను మాత్రం ఇంటి నుంచే పాలన సాగిస్తున్నారు. రేవంత్‌ చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండదని, ఆయన తన సామాజికవర్గానికి తప్పా ఇతర ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వరు అనడానికి గత ఏడు నెలల పాలన కాలంలో ఆయన వైఖరే అందుకు నిదర్శనం అంటున్నారు. ఏపీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు చూసిన ఆయన అభిమానులు దాన్ని స్వాగతిస్తూ.. తెలంగాణలోనూ రేవంత్‌ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు పెట్టేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

Tags:    

Similar News