ఏం చేసినం.. ఏం చెప్తం

ప్రజాభవన్‌లో నేడు సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులతో భేటీ కానున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీఎం నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

By :  Raju
Update: 2024-07-17 06:01 GMT

రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇంకేమీ అమలు కాలేదు. మిగతా వాటి సంగతి ఏమిటని ప్రజలు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల, ఎంపీలే కాదు కొందరు మంత్రులు ప్రజలకు ఏం చెప్పాలో తెలియక మథనపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజాభవన్‌లో నేడు సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులతో భేటీ కానున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇందులో పాల్గొననున్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సీఎం నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఏడు నెలల కాలంలో రేవంత్‌ సర్కార్‌ ఆరు గ్యారెంటీలలో ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. దీనిపై విపక్ష పార్టీ నిత్యం ప్రభుత్వాన్ని ఎండగడుతున్నది. మరో ప్రతిపక్షం బీజేపీ కూడా రేవంత్‌ సర్కార్‌ అవినీతి బాగోతాన్ని బైటపెడుతున్నది. ప్రజాపాలన పేరు చెప్పుకుంటూ ప్రజలను గోస పెడుతున్నది. రేవంత్‌ ప్రభుత్వ పనితీరును చూస్తున్న ప్రజలు తుంట ఎత్తేసి మొద్దు ఎత్తుకున్నట్టు అయిందని వాపోతున్నారు. పూటకో మాట మార్చే రేవంత్‌ మాయమాటలు నమ్మి ఓట్లు వేసినందుకు సిగ్గుపడుతున్నామని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇక గృహ జ్యోతి కింద ప్రతి కుటుంబానికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ మాకు అందడం లేదని ప్రజాపాలన సేవా కేంద్రాల వద్ద ప్రజలు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఏడు నెలలు గడుస్తున్నా ఎప్పుడిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు.

మహిళలకు మహాలక్ష్మి గ్యారెంటీ కింద అనేక హామీలు ఇచ్చిన రేవంత్‌ ప్రభుత్వం నెలకు 2500 ఎపుడు ఇస్తారని, రూ. 500 లకే గ్యాస్‌ సిలిండర్ మాటేమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతోనే మా కష్టాలు తీరుతాయా? అని నిలదీస్తున్నారు. రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకూ ఎకరానికి రూ. 15,000 ఇస్తామని, వ్యవసాయ కూలీలకు రూ. 12,000 ఇస్తామని, వరి పంట రూ. 500 బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వకపోగా దీనిపై ప్రభుత్వం అభిప్రాయాల సేకరణ పనిలో ఉన్నది. రైతు బంధు పైసలు కూడా ఇప్పటివరకు పడలేదు. వరికి బోనస్‌ కేవలం సన్నరకం పండించే రైతులకు మాత్రమే అని కాంగ్రెస్‌ ప్రభుత్వం కండీషన్లు పెట్టింది. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అడ్డగోలు నిబంధనలు పెట్టింది. వీటిపై రైతులు రోడ్డెక్కారు. నమ్మించి గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంలోంచి పొయ్యిల పడ్డట్టు తయారైంది. దీంతో ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి నిరసనలు ఎదరవుతున్నాయి. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల్లో ఉండాలని ఆదేశిస్తున్నారు. తమ ప్రభుత్వం ఈ ఏడు నెలల కాలంలో చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను సీఎం కలెక్టర్లదే అన్నారు. ఫిరాయింపులు, హస్తిన పర్యటనలతోనే కాలం వెళ్లదీస్తున్న సీఎం తీరుపై కొంత మంది సీనియర్లు, కాంగ్రెస్‌ ద్వితీయ శ్రేణులు అసంతృప్తితో ఉన్నారు. ప్రతీ పథకంలో కోతలు విధిస్తూ.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రజలకు మొఖం చూపెట్టే పరిస్థితి లేదని వాపోతున్నారు. దీంతో గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి చెప్పడానికి ప్రజాప్రతినిధులు వెనుకడుగు వేస్తున్నారు. ప్రజలకు చెప్పడానికి ఏం చేశామనే ప్రశ్న ఆపార్టీ నేతల్లోనే తలెత్తుతున్నది. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. బైటికి ఏం చెప్పుకుంటున్నా కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత సమావేశాల్లో సీఎం వ్యవహారశైలి వల్ల పార్టీ పుట్టి మునగడం ఖాయమనే పార్టీవర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం.

Tags:    

Similar News