వినేశ్ ఫోగట్‌పై కుట్ర జరిగిందా.. ఆ మాజీ ఎంపీపై వ్యతిరేకంగా పోరాటం కారణామా ?

వినేశ్ ఫోగట్‌పై కుట్ర జరిగిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై జంతర్ మంతర్ వద్ద వివాదాస్పద రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా నిరసన తెలపటం కారణామా

By :  Vamshi
Update: 2024-08-07 14:46 GMT

పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో వినేశ్ ఫోగట్ అనర్హత వేటు పడటం తీవ్ర దుమారం రేపుతుంది. ఆమెపై కుట్ర జరిగిందని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా దీనిపై కాంగ్రెస్ ఎంపీ బ‌ల్వంత్ వాంఖ‌డే స్పందించారు. బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేసినందుకు రెజ్లర్ వినేశ్‌ ఫోగాట్ తన పతకాన్ని కోల్పోయారని వాంఖడే ఆరోపించారు. చాలా బాధాకరమైన విషయం. దీని వెనుక ఏదో కుట్ర ఉంది. ఆమె జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపడం దేశం మొత్తానికి తెలుసు. ఆమెకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఆమె గెలిస్తే, వారు ఆమెను గౌరవించవలసి ఉంటుంది. ఇది వారికి ఇష్టం లేదు" అని చెప్పుకొచ్చారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి దారి తీసింది.కాగా తమ‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై జంతర్ మంతర్ వద్ద వివాదాస్పద రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ప‌లువురు అంతర్జాతీయ మ‌హిళా రెజ్లర్లలో వినేశ్ ఫోగాట్ ఒకరు. దాంతో రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను తొలగించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు టికెట్ కూడా ఇవ్వ‌లేదు. అయితే, ఆయన కుమారుడు కాషాయ పార్టీ టికెట్‌పై ఆయన స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

కేవలం 100 గ్రాముల అదనపు బరువు కారణంగా ఆమెను పోటీ నుంచి తప్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలపై తాజాగా భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌ స్పందించారు. ఇందులో వినేశ్‌ తప్పేం లేదంటూ ఆమెకు అండగా నిలిచారు.‘‘ఫైనల్‌కు చేరి ఏదో పతకం ఖాయమే అని అనుకున్న సమయంలో ఇలా వినేశ్‌పై అనర్హత వేటు పడటం బాధాకరమని అన్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వినేశ్‌ తప్పు చేసినట్లు భావించడం లేదు. రెండు రోజుల పాటు ఆమె బరువు స్థిరంగానే ఉంది. రాత్రికి రాత్రి ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనికి కారణమేంటనేది ఆమె కోచ్‌, న్యూట్రిషనిస్ట్‌, సహాయక సిబ్బందే వివరణ ఇవ్వాలి. దీనిపై విచారణ జరగాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని సంజయ్‌ సింగ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినేశ్‌ అనర్హత నేపథ్యంలో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అధ్యక్షుడు నెనాద్ లాలోవిక్ స్పందించాడు. 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా వినేశ్‌పై అనర్హత వేటు పడటం దురదృష్టకరం అన్నాడు.

వినేశ్‌ రాత్రికిరాత్రి బరువు పెరిగిందని తెలిపాడు. బరుపు తగ్గేందుకు వినేశ్‌ శతవిధాల ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అన్నాడు. ఏదిఏమైనా రూల్స్‌ను గౌరవించాల్సిందేనని పేర్కొన్నాడు. ఇందుకు వినేశ్‌ మినహాంపు కాదని లాలోవిక్ తెలిపారు. వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు వేయడంపై భారత బాక్సర్, ఒలంపిక్ మెడలిస్ట్ విజేందర్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. వినేశ్ ఫొగట్ అనర్హత వేటు వెనుక ఏదో కుట్ర కచ్చితంగా జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. పెరిగిన ఆ 100 గ్రాముల్ని తగ్గించుకునేందుకు ఒలంపిక్ కమిటీ అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటిది గతంలో తానేప్పుడూ చూడలేదని.. భారత రెజ్లర్లపై ఏదో కుట్ర జరుగుతోందని అన్నారు. బహుశా మన గెలుపుని చూడలేని వారు ఈ పన్నాగానికి పాల్పడ్డారేమో అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఒక్కోసారి రాత్రికి రాత్రే ఐదారు కిలోలు తగ్గుతుంటామన్నారు. 100 గ్రాములు తగ్గడం పెద్ద సమస్య కాదు. తప్పకుండా అనుమానించాల్సిందే అని పేర్కొన్నారు.

Tags:    

Similar News