రుణమాఫీ కానోళ్లు 17.14 లక్షల మంది

మాఫీ మతలబు చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. విపక్షాల ఆరోపణలు సక్రమమేనని పరోక్షంగా ఒప్పుకున్న మంత్రి

Update: 2024-08-19 14:22 GMT

రాష్ట్రంలో రుణమాఫీ కానోళ్ల లెక్కను ఇరిగేషన్, సివిల్ సప్లయీస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చేశారు. మొత్తం 17.14 లక్షల మందికి రుణమాఫీ కాలేదని మీడియా ముఖంగా మంత్రి అంగీకరించారు. రుణమాఫీపై బీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు సక్రమమేనని ఆయన పరోక్షంగా ఒప్పుకున్నారు. సోమవారం జలసౌధలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. సాధారణంగా ఆధార్ అంటే 12 నంబర్లు ఉంటాయని, 1.20 లక్షల మందికి ఆధార్ కార్డులో అయితే 11, లేదంటే 13 నంబర్లు ఉండటంతో వారి రుణాలు మాఫీ కాలేదన్నారు. 1.61 లక్షల మందికి ఆధార్ లో ఒక పేరు ఉంటే బ్యాంక్ పాస్ బుక్ లో మరో పేరు ఉందని, ఈ మిస్ మ్యాచ్ కారణంగా వాళ్ల రుణాలు మాఫీ కాలేదన్నారు. లక్షన్నర మంది బ్యాంక్ ఎకౌంట్లలో తప్పులున్నాయని, దీంతో వారికి రుణమాఫీ వర్తించలేదన్నారు. 4.83 లక్షల మందికి రేషన్ కార్డులు లేవని, వారి ఎకౌంట్లు వెరిఫికేషన్ చేయాల్సి ఉందని, ఈ కారణంగా వారి రుణాలు మాఫీ కాలేదన్నారు. 8 లక్షల మంది రైతులు రూ.2 లక్షల కన్నా ఎక్కువగా క్రాప్ లోన్లు తీసుకున్నారని, రూ.2 లక్షలకు పైబడిన మొత్తం రైతులు బ్యాంకులకు చెల్లించిన తర్వాతే వారికి రుణమాఫీ వర్తిస్తుందని కుండబద్దలు కొట్టారు. మొత్తంగా తమ ప్రభుత్వం 17.14 లక్షల మందికి రుణమాఫీ ఎగవేసిందని అంగీకరించారు.

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రుణమాఫీ గురించి ఒక లెక్కలు చెప్పి, అధికారంలోకి వచ్చాక ఇంకో లెక్క చెప్పి.. కేబినెట్ సమావేశంలో రూ.31 వేల కోట్లు కేటాయించామని అధికారిక ప్రకటన చేసి..బడ్జెట్ లో రూ.26 వేల కోట్లు కేటాయించి.. చివరికి రూ.17,900 కోట్ల రుణమాఫీ చేసింది. రైతులను ప్రభుత్వమే గందరగోళ పరిచి, కన్ఫ్యూజన్ లో ముంచేసి ఇప్పుడు ప్రతిపక్షాలు రైతులను గందరగోళ పరుస్తున్నాయని ఆరోపణలు చేస్తోంది. జలసౌధలో మాట్లాడిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి ఇద్దరూ ఇదే ధోరణిలో మాట్లాడారు. వివిధ కారణాలతో రుణమాఫీ కాని రైతులకు త్వరలోనే రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ దానికి టైం బాండ్ అంటూ ఏమీ లేదు. రూ.2 లక్షలకు పైబడిన రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లను పూర్తిగా చెల్లిస్తే తప్ప వారి లోన్లు మాఫీ అయ్యే అవకాశం లేదు. మిగతా 9 లక్షల మంది క్రాప్ లోన్లు మాఫీ చేయడం అంత ఈజీ ఏమీ కాదు. కానీ ప్రతిపక్షాల మాటల దాడి.. రైతుల వరుస ఆందోళనలతో బిక్కచచ్చిన ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి మరింత కన్ఫ్యూజన్ కు గురి చేస్తోంది. ముఖ్యమంత్రి రుణమాఫీ పూర్తి చేశామని చెప్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సీఎం మాటలనే రివైండ్ చేస్తున్నారు. రూ.2 లక్షల వరకున్న క్రాప్ లోన్లు మాఫీ అయిపోయాయి ప్రతిపక్షాలే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని అంటున్నారు. మిగతా మంత్రులేమో రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని.. త్వరలోనే అందరికీ వర్తింపజేస్తామని చెప్తున్నారు. రుణమాఫీ విషయంలో క్లారిటీ మిస్ అయ్యింది ఎవరికైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే. సీఎం, మంత్రుల స్టేట్ మెంట్లు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అయినా ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా బుకాయించడానికే ప్రాధాన్యత ఇస్తోంది. ఇలా ఎన్నాళ్లు చేస్తారో ప్రజల్లో.. రైతుల్లో ఈ ప్రభుత్వం మరింత పలుచన కావడం ఖాయం.

Similar News