ప్రయాణికుల రద్దీయే.. ప్రమాదానికి కారణమా!

ఆర్టీసీ బస్సు కింద‌ పడి ఇంటర్‌ విద్యార్థిని దుర్మరణం

Byline :  Vamshi
Update: 2024-06-14 11:25 GMT

ఆర్టీసీ బస్సు కింద పడి ఓ ఇంటర్‌ విద్యార్థిని మృతి చెందిన ఘటన కలకలం సృష్టిస్తున్నది. యూసఫ్‌గూడలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది. ప్రమాద ఘటన ప్రకారం ఓ విద్యార్థిని యూసఫ్‌గూడలో ఉన్న మాస్టర్స్‌ కాలేజీలో ఇంటర్మిడియెట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నది. రోజూ ఆమె కాలేజీకి ఆర్టీసీ బస్సులో వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం యూసఫ్‌గూడ బస్టాండ్‌ వద్ద వేచి చూస్తున్నది. ఈ లోగా తన గమ్యస్థానానికి వెళ్లాల్సిన బస్సు రావడంతో ఎక్కేందుకు ప్రయత్నించి జారి పడిపోయింది. బస్సు టైర్లు ఆమెపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న మధురానగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియలేదని, ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు.

అయితే ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా జరిగాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే. అయితే పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా బస్సులు పెంచాలనే డిమాండ్‌ ఉన్నది. కానీ ప్రభుత్వం నుంచి దీనిపై సరైన స్పందన లేదు. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకునే క్రమంలో మహిళలు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడాని ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఫుట్‌బోర్డులపైనే మహిళలు, కాలేజీ చదివే విద్యార్థులు ప్రయాణం చేయాల్సి వస్తున్నది. ఈ క్రమంలోనే బస్సు ఎక్కే సమయంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Tags:    

Similar News