గురుకుల మహిళ టీచర్లకు బెదిరింపులు

ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లలో అన్యాయం జరిగిందని ఆందోళన చేయడమే పాపం.. ధర్నా చౌక్ తెరిచిన దార్శనికుడి పాలనలో ప్రజాస్వామ్యం తీరు ఇది

Update: 2024-08-23 06:24 GMT

ప్రజలు తమ నిరసన తెరపడానికి.. వివిధ రూపాల్లో తమ గోడు చెప్పుకోవడానికి ధర్నా చౌక్ తెరిచిన మహా దార్శనికుడు ఎవరైరా ఉన్నారంటే అది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే. ఆయన పాలన సరిగ్గా వెలగ బెట్టలేకపోతే.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చచ్చే వరకు ఆ ధర్నా చౌక్ లో నిరాహార దీక్ష చేసుకోవచ్చు.. తమ ప్రభుత్వం రక్షణ కల్పిస్తది అని అసెంబ్లీ సాక్షిగా గొప్పగా చెప్పుకునే భవిష్యత్ దివిటీ మన రేవంత్ రెడ్డి. ఆ దార్శనికుడి పాలనలో గురుకుల మహిళ టీచర్లు తమకు జరిగిన అన్యాయంపై ప్రజాస్వామ్య బద్ధంగా పోరాటం చేశారు. ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లలో తమకు అన్యాయం జరిగింది దానిని సరి చేయాలి.. ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని తప్పులను ఎత్తిచూపిన మహిళ టీచర్లను మన దార్శనిక ముఖ్యమంత్రి అభినందించాలి.. కానీ ఆయన ఆదేశాలు పాటించే ఐఏఎస్ అధికారి వారిపై కన్నెర్ర చేశారు. ఠాట్.. క్రమశిక్షణ తప్పారు.. కఠిన చర్యలు తప్పవంటూ ఏకంగా బెదిరింపులకు దిగారు. ధర్నా చౌక్ తెరిచిన దార్శనికుడు.. భవిష్యత్ దివిటీ పాలనలో ఒక ఐఏఎస్ అధికారి ఇలాంటి హెచ్చరికలు చేయడం తగునా? అయినా ఇదంతా ముఖ్యమంత్రికి తెలిసి ఉండకపోవచ్చేమో?

ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లలో తమకు అన్యాయం జరిగిందని 142 మంది మహిళా టీచర్లు సంక్షేమ భవన్ ఆవరణలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ సెక్రటరీ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. ఇలా ధర్నా చేసినందుకు వారిని హెచ్చరిస్తూ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి మెమో జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేశారు కాబట్టి క్రిమినల్ కేసులు పెడుతామని బెదిరింపులకు దిగారు. మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధర్నా చేసిన ప్రతి ఒక్కరూ తన ఆఫీస్ కు వచ్చి వివరణ ఇచ్చి తీరాలని ఆదేశించారు. గురుకులాల్లో బదిలీలు, పదోన్నతుల్లో అక్రమాలు నిజమేనని ఉన్నతాధికారులే ఒప్పుకుంటున్నారు. కొందరు దొడ్డిదారిలో ప్రమోషన్లు పొందారని, తాము అనుకున్న చోటికి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారని అంగీకరిస్తున్నారు. కానీ గురుకులాల సెక్రటరీ అన్యాయమైనోళ్లపైనే క్రిమినల్ కేసులు పెడుతామని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు అక్రమంగా ప్రమోషన్లు పొందిన ట్రాన్స్ ఫర్ చేయించుకున్న వారి చర్యలను సమర్థించారు కూడా. ఇవేవి ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతన్నవి కావు. స్వయాన ధర్నా చౌక్ తెరిచన ధర్మ ప్రభువులు, దార్శనికులు రేవంత్ రెడ్డినే ఆ సంక్షేమ శాఖకు కూడా మంత్రి. తన శాఖలోనే ధిక్కారమా అన్నట్టుగా ఏలిన వారు ఆదేశాలిచ్చారో.. ఉన్నతాధికారే నిర్ణయం తీసుకున్నారోగానీ గురుకుల టీచర్లపై మెడపై కత్తి పెట్టారు.


తప్పు చేసింది వాళ్లు.. శిక్ష టీచర్లకా?

గురుకులాల్లో టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లలో సొసైటీ చేసిన తప్పిదాలకు టీచర్లను బాధ్యులను చేస్తున్నారు. సీనియర్ టీచర్ ను జోన్ డిస్ లొకేషన్ పేరుతో దూర ప్రాంతానికి ట్రాన్స్ ఫర్ చేసి జూనియర్ టీచర్ కు మంచి పోస్టింగ్ లు ఇచ్చారు. ప్రమోషన్లలోనూ పారదర్శకంగా వ్యవహరించలేదు. తమ గోడు చెప్పుకుందామని టీచర్లు ప్రయత్నించినా అధికారులు వినిపించుకోవడం లేదు. రకరకాల ప్రయత్నాలతో ఎవరైన ఉన్నతాధికారుల దగ్గరి వరకు వెళ్తే తప్పు జరిగింది నిజమే సరిదిద్దామని నోటి మాటగా చెప్తున్నారు. కానీ ఇంతవరకు తప్పులను సరి చేయలేదు. ఆ తప్పులకు బాధ్యులైన స్టాఫ్ట్ పైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తమ గోడు చెప్పుకోవడానికి అవకాశం లేకనే జోన్ డిస్ లొకేట్ పేరుతో ట్రాన్స్ ఫర్ అయిన టీచర్లు, ఇతర కారణాలతో ప్రమోషన్లు దక్కని టీచర్లు ఆందోళనకు దిగారు. వారిని పిలిచి మాట్లాడితే సమస్య పరిష్కారం అయ్యేది. కానీ అధికారులు ఆ ప్రయత్నం చేయకుండా వారిని బెదిరించే ప్రయత్నాలకు దిగారు. టీచర్లను బెదించడానికి చూపిన చొరవలో కొంతైనా వాళ్ల ఆఫీస్ స్టాఫ్ తప్పిదాలపై చూపి ఉంటే ఎంత మందిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చేది గురుకుల సొసైటీలో ఎవరిని అడిగినా చెప్తారు. అయినా ధిక్కారముల్ సైతుమా? అన్నట్టు ప్రభుత్వం మహిళ టీచర్లను హెచ్చరించడానికి.. బెదిరించడానికి.. భయపెట్టడానికే మొగ్గు చూపింది.

గురుకుల మహిళ టీచర్లకు ఇచ్చిన వార్నింగ్​ లెటర్​, నోటీసుల కోసం కింది లింక్​ లు క్లిక్​ చేయండి

https://www.teluguscribe.com/pdf_upload/1204-warning-851433.పిడిఎఫ్

https://www.teluguscribe.com/pdf_upload/1204-notice-851435.pdf

Tags:    

Similar News