అశోక్‌నగర్‌కు వెళ్లి రెచ్చగొట్టారు.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారు: హరీశ్‌రావు

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రాయడానికి 1:100 చొప్పున అవకాశం కల్పించాలని, గ్రూప్‌ 2, 3పోస్టులు పెంచుతామన్న వాగ్దానానికి అనుగుణంగా ప్రభుత్వం పోస్టులు పెంచాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

By :  Raju
Update: 2024-06-17 07:23 GMT

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష రాయడానికి 1:100 చొప్పున అవకాశం కల్పించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే అశోక్‌నగర్‌కు వెళ్లి నిరుద్యోగులను రెచ్చగొట్టి గ్రూప్‌ 2, 3పోస్టులు పెంచుతామన్నారు. వారిచ్చిన వాగ్దానానికి అనుగుణంగా ప్రభుత్వం పోస్టులు పెంచాలని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మధుసుదనాచారి, శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి హరీశ్‌రావు మాట్లాడుతూ.. గ్రూప్స్‌ రాసే విద్యార్థులు ఈ విషయాలపై తమకు వినతి పత్రం ఇచ్చారని చెప్పారు.

గ్రూప్‌-1 1: 100 చొప్పున పరీక్షకు అవకాశం ఇవ్వాలి

నాటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గ్రూప్‌ -1 మెయిన్స్‌కు 1:50 పద్ధతిలో కాకుండా 1: 100 చొప్పున ఎక్కువ మంది రాసే అవకాశం కల్పించాలని అసెంబ్లీలో నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా మాజీ మంత్రి మీడియా ముందు చూపెట్టారు. అశోక్‌నగర్‌కు వెళ్లి ఇదే కాంగ్రెస్‌ నేతలు నిరుద్యోగులను రెచ్చగొట్టి, తాము అధికారంలోకి వచ్చాక గ్రూప్‌-1 మెయిన్స్‌లో 1: 100 చొప్పున అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని హరీశ్‌ మండిపడ్డారు. గ్రూప్‌-2, 3లలో పోస్టులు పెంచుతామని నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే పరీక్షకు పరీక్షకు మధ్య రెండు నెలల వ్యవధి ఉండాలని గతంలో కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. కానీ ఇప్పుడేమో జులై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ షెడ్యూల్‌ చూస్తే పరీక్షకు పరీక్షకు మధ్య ఏడు రోజుల సమయం మాత్రమే ఉన్నదని హరీశ్‌ తెలిపారు.

పరీక్షకు పరీక్షకు మధ్య రెండు నెలల వ్యవధి హామీ ఏమైంది?

గతంలో పిల్లలు ఎలా చదువుకుంటారు. కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలని అన్నది. ఇదే విషయాన్ని నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అవకాశం లేదంటున్నారు. నాడు ఇచ్చిన మాట ఇప్పుడు తప్పుతున్నారని వారు వాపోతున్నారు. సంగీత అనే అమ్మాయి పరీక్ష తేదీలు దగ్గరగా ఉన్నాయని ఒత్తిడిలో ఆత్మహత్యకు పాల్పడిందని నిరుద్యోగులు మా దృష్టికి తీసుకొచ్చారని హరీశ్‌ చెప్పారు. నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కనికరం లేదా? మీరు కళ్లు తెరవరా? మీరు నాడు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, ఉపన్యాసాలు ఏమయ్యాయిని ప్రశ్నించారు. ఇప్పటికైనా యువతకు ఇచ్చిన మాట ప్రకారం పరీక్షకు పరీక్షకు మధ్య రెండు నెలల వ్యవధి పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

జాబ్‌ క్యాలెండర్‌ ఏమైంది?

కాంగ్రెస్‌ పార్టీ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పింది. ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అది మా బాధ్యత అని, ఆరు గ్యారెంటీల్లో భాగమని ప్రమాణాలు చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క సంతకం చేసి ప్రజలను నమ్మించారు. బాండ్‌ పేపర్లు రాసిచ్చారు. ఆరు గ్యారెంటీలపై, జాబ్‌ క్యాలెండర్‌పై అన్నిపత్రికల్లో ఫుల్‌పేజీ యాడ్స్‌ ఇచ్చారు. ఎన్నికలకు ముందు జ్యాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామన్న కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయినా ఎందుకు విడుదల చేయలేదని నిరుద్యోగుల పక్షాన అడుగుతున్నట్లు హరీశ్‌ తెలిపారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మీరు ఆరు నెలల్లో ఒక్క నోటిపికేషన్‌ అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు కోటలు దాటాయని, అధికారంలోకి వచ్చాక చేతలు గడప దాటని పరిస్థితి అని ఎద్దేవా చేశారు. ఇది నిరుద్యోగ యువతీ యువకులను మోసం చేయడమే అన్నారు.

25 వేలతో మెగా డీఎస్సీని నిర్వహించాలి

రాష్ట్రంలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మొదటి క్యాబినెట్‌లోనే 25 వేల మెగా డీఎస్సీకి అనుమతిస్తామని హమీ ఇచ్చారు. ఆనాడు 25 వేల మెగా డీఎస్సీ అన్న మీరు 11 వేల కే ఎందుకు పరిమితం చేశారు? ఇచ్చిన మాట ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగాలను 25 వేలకు పెంచి మెగా డీఎస్సీని నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తున్నదన్నారు.

Tags:    

Similar News