భూ ఆక్రమణలతోనే భారీ వరదలు

ఖమ్మం నగరంలో ఆక్రమణలు వల్లే భారీగా వరదలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని సీఎం తెలిపారు.

By :  Vamshi
Update: 2024-09-03 07:50 GMT

ఖమ్మం నగరంలో ఆక్రమణలు వల్లే భారీగా వరదలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని సీఎం తెలిపారు. ఖమ్మంలో మీడియా ప్రతినిధులతో సీఎం చిట్‌చాట్ నిర్వహించారు. మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజినీర్లతో చర్చిస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 42 సెం.మీ వర్షం పడిందన్నారు. ప్రభుత్వ ముందుచూపు వల్లే ప్రాణ నష్టం తగ్గిందని సీఎం వెల్లడించారు. తాను చెప్పిందే చేస్తానని.. చేసేదే చెబుతానని వెల్లడించారు. తక్షణ సాయంగా బాధితుల ఇంటికి బియ్యం, ఇతర నిత్యావసరాలతో పాటు పదివేల రూపాయలు పంపిస్తున్నానని తెలిపారు.

తెలంగాణకు వరదల కారణంగా రూ.5438 కోట్ల నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారన్నారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటుందని ముఖ్యమంత్రి భరోసా కల్పించారు. ప్రతి ఒక్క రైతును ఆదుకుంటుందని.. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖ ద్వారా జరిగిన నష్టాన్ని వివరించానని రేవంత్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి న్యాయం చేయాలని ప్రధాని మోదీని ఢిల్లీ వెళ్లి కలుస్తానన్నారు.

Tags:    

Similar News