కాళేశ్వరంలో చిన్నతప్పును భూతద్దంలో చూపెట్టారు: కేటీఆర్‌

ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే ఇప్పుడూ ఉన్నాయని, అప్రజాస్వామికంగా విద్యార్థులపై దాడులు చేస్తూ, కేసులు పెడుతున్నారని, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అక్రమంగా చేర్చుకుంటున్నారనే విషయాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లింది.

By :  Raju
Update: 2024-07-20 08:07 GMT

కాళేశ్వరంలో జరిగిన చిన్న తప్పి దాన్ని కాంగ్రెస్ పార్టీ భూతద్దంలో చూపెట్టిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డను సందర్శిస్తామన్నారు. ఫిరాయింపులు, నిరుద్యోగుల అంశాలపై బీఆర్‌ఎస్‌ నేతల బృందం గవర్నర్‌ రాధాకృష్ణన్‌కు వినతి పత్రం ఇచ్చింది.

ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులే ఇప్పుడూ ఉన్నాయని, అప్రజాస్వామికంగా విద్యార్థులపై దాడులు చేస్తూ, కేసులు పెడుతున్నారని, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అక్రమంగా చేర్చుకుంటున్నారనే విషయాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లింది.అనంతరం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడుతూ...

రెండు ముఖ్యమైన అంశాలు గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చాం. అందులో మొదటి సీఎం రేవంత్‌రెడ్డి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఎన్నికలకు ముందు తెలంగాణ నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలోకి తొక్కి హామీలును అమలు చేయని అడుగుతున్న నిరుద్యోగులపై నిర్బంధాలు, అణిచివేతలు, అరెస్టులు చేస్తూ అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తున్నది. ఉద్యమ సమయంలో యూనివర్సిటీలలో ఎలాంటి భయానక వాతావరణాన్ని చూశామో.. అదేరకమైన వాతావరణం నేడు పునరావృతమౌతున్నదని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా ప్రకటనలు ఇచ్చన విషయాన్ని గవర్నర్‌ దృష్టి తీసుకు వెళ్లామని కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్‌-1, 2, 3 నోటిఫికేషన్లను రద్దు చేసి తిరిగి కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని, పోస్టుల సంఖ్య పెంచుతామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటను గుర్తుచేశామన్నారు. అలాగే జాబ్‌ క్యాలెండర్‌ ఇప్పటివరకు విడుదల చేయాలని, ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్న విషయాన్ని గవర్నర్‌ వద్ద ప్రస్తావించామన్నారు.మెగా డీఎస్సీ వేయలేదు, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు రూ. 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదు. అలాగే చిక్కడపల్లి సెంట్రల్‌ లైబ్రరీలో చదువుకుంటున్న వారిని, ఓయూ హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను అరెస్టు చేయడం, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరును గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. దీనిపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు. హోం సెక్రటరీని పిలిపించి అన్ని వివరాలు తెలుసుకుంటానని, విద్యార్థులపై ఇలా జరగడం మంచిది కాదని గవర్నర్‌ అన్నట్టు కేటీఆర్‌ తెలిపారు. దీనిపై ప్రభుత్వాన్ని అడుగుతానని గవర్నర్‌ చెప్పారని కేటీఆర్‌ అన్నారు. నిరుద్యోగుల విషయంలో గవర్నర్‌ స్పందించిన తీరుపై తాము అభినందిస్తున్నట్టు కేటీఆర్‌ చెప్పారు.


 



ఫిరాయింపులపై..

రెండోది ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హననం. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తుంగులోకి తొక్కి బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను, 8 మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌ పార్టీలో చేరుకున్న విషయాన్ని గవర్నర్‌కు సోదాహరణంగా వివరించామన్నారు. దీనిపై ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఇచ్చిన పిటిషన్లపై, న్యాయపోరాటం విషయాన్ని గవర్నర్‌కు చెప్పామన్నారు. ఖైరాతాబాద్‌ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ టికెట్‌ పై గెలిచి మొన్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై పోటీ చేసిన విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కూడా గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని, తన పరిధిలో ఉన్నంతవరకు తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని కేటీఆర్‌ తెలిపారు.

ప్రోటోకాల్‌ విషయంలో..

చివరగా ప్రోటోకాల్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జరుగుతున్న అగౌరవం, అధికారులు వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వ నిర్వాకాన్ని కూడా గవర్నర్‌ కు చాలా వివరంగా చెప్పాం. ప్రజాప్రతినిధిగా గెలిచిన అభ్యర్థి ఏ పార్టీ వారైనా వారి గౌరవానికి భంగం కలగడం మంచి పద్ధతి కాదని, దీనిపై తాను ప్రభుత్వానికి ఉత్తరం రాస్తానని గవర్నర్‌ చెప్పారని, దీనికి వారికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. గవర్నర్‌నే కాదని, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారందరినీ కలిసి కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న నిర్వాకాన్ని వారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాహుల్‌గాంధీఒకవైపు రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని రాజ్యాంగాన్ని రక్షిస్తున్నట్టు ఫోజులు కొడుతూ.. మరోవైపు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. అవసరమైతే రాష్ట్రపతి కలిసి వారికి కూడా వివరించి చెబుతామన్నారు. గవర్నర్‌ కలిసిన బీఆర్‌ఎస్‌ బృందంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌, పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉన్నారు.

Tags:    

Similar News