టన్నెల్‌ కు పోటెత్తిన వరద.. మునిగిన 'పాలమూరు' పంపుహౌస్‌

రేవంత్‌ సర్కారు నిర్లక్ష్యంతో నీట మునిగిన వట్టెం.. హెడ్‌ రెగ్యులేటర్‌ కు గేట్లు పెట్టని వర్క్‌ ఏజెన్సీ, డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ లు మూసేసినా నష్టం తప్పేది అంటున్న ఇంజనీర్లు

Update: 2024-09-03 13:56 GMT

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్‌ స్కీంలో భాగమైన వట్టెం పంపుహౌస్‌ నీట మునిగింది. పంపింగ్‌ కు సిద్ధంగా ఉన్న నాలుగు మోటార్లు నీటిలో మునిగిపోయాయి. హైదరాబాద్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టు సుంకిశాల రిటైనింగ్‌ వాల్‌ కూలిపోయిన ఘటనను గోప్యంగా ఉంచినట్టే వట్టెం పంపుహౌస్‌ నీట మునిగిన ముచ్చట కూడా బాహ్య ప్రపంచానికి తెలియనివ్వకుండా రేవంత్‌ సర్కారు ప్రయత్నించింది. కానీ నిజం బయట పడింది. పంపుహౌస్‌ నీట మునగడంతో పెద్దగా నష్టమేమి ఉండదని ప్రభుత్వం కవర్‌ చేసుకునే ప్రయత్నాలకు తెరతీసింది. రూ. వెయ్యి కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన మోటార్లతో పాటు ఎలక్ట్రో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఎక్విప్‌మెంట్‌ నీటి పాలయ్యింది. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో తూడుకుర్తి, నాగనూలు, శ్రీపురం చెరువులు మత్తడి దుంకాయి. ఆ నీళ్లన్నీ నాగర్‌ కర్నూల్‌ చెరువులోకి చేరాయి. ఈ చెరువు మత్తడి దుంకడంతో వరద నీళ్లు ఏదుల నుంచి వట్టెం పంప్‌ హౌస్‌ కు నీటిని తరలించే టన్నెల్‌లోకి చేరాయి. ఆ టన్నెల్‌ గుండా దాదాపు 20 కి.మీ.ల దూరంలోని వట్టెం పంపుహౌస్‌ ను వరద ముంచెత్తింది. మొదట పంపుహౌస్‌ దిగువన ఉన్న సర్జ్‌ పూల్‌ పూర్తిగా నిండి ఆ నీళ్లు పంపుహౌస్‌లోకి ఉబికి వచ్చాయి. దీంతో పంపింగ్‌ కు రెడీగా ఉంచిన నాలుగు పంపులు వరద నీటిలో మునిగిపోయాయి.

వట్టెం పంపుహౌస్‌ లో 145 మెగావాట్ల కెపాసిటీ ఉన్న తొమ్మిది మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసి నాలుగు మోటార్లు, పంపులు ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించిన ఎలక్ట్రో మెకానికల్‌, హైడ్రో మెకానికల్‌ పనులు కూడా సిద్ధం చేశారు. ఈ పంపుహౌస్‌ కోసం ఇప్పటికే దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చు చేశారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల్లో మొదటి పంపుహౌస్‌ ఎల్లూరు లో ఒక మోటార్‌ ఆన్‌ చేసి అధికారికంగా ఎత్తిపోతలు ప్రారంభించారు. ఆ తర్వాత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఈ లిఫ్ట్‌ స్కీం పనులను పూర్తిగా పక్కన పెట్టింది. ఏదుల, వట్టెం పంపుహౌసుల్లో ఒక్కో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా నాలుగేసి మోటార్లు ఏర్పాటు చేశారు. ఆ పంపుహౌస్‌ లకు కరెంట్‌ సరఫరా చేసే ట్రాన్స్‌ మిషన్‌ లైన్లు సహా ఇతర పనులు చేయలేదు. రెండు నెలల క్రితమే పాలమూరు పనుల్లో కొద్దిపాటి కదలిక వచ్చింది. వట్టెం పంపుహౌస్‌ సర్జ్‌ పూల్‌ లోకి నీటిని విడుదల చేసే హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మించినా వర్క్‌ ఏజెన్సీ దానికి గేట్లు భిగించలేదు. దీంతో టన్నెళ్లలోకి వచ్చిన నీళ్లు మొత్తం సర్జ్‌ పూల్‌ నిండాయి. సర్జ్‌ పూల్‌ నుంచి మోటార్లకు నీటిని సప్లయ్‌ చేసే డ్రాఫ్ట్‌ ట్యూబ్‌ క్లోజ్‌ చేసి ఉంటే నీళ్లు పైకి చేరేవి కావు. ఎగువ నుంచి వరద వస్తున్నా, మోటార్లను రక్షించే ప్రయత్నమేది చేయలేదు. దీంతో సర్జ్‌ పూల్‌ లోని నీళ్లు పంపుహౌస్‌ లోపలికి వచ్చేసి నాలుగు మోటార్లు నీట మునిగాయి.

పంపులన్నీ మునిగిపోయిన తర్వాత ప్రభుత్వం నింపాదిగా డీ వాటరింగ్‌ ప్రక్రియ చేపట్టింది. పంపుహౌస్‌ లోకి చేరిన నీళ్లన్నీ ఎత్తిపోయడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని ఫీల్డ్‌ ఇంజనీర్లు చెప్తున్నారు. డీవాటరింగ్‌ పూర్తయిన తర్వాత బిగించిన మోటార్లను వెలికి తీసి హీట్‌ చేసి మళ్లీ బిగిస్తామని, డీవాటరింగ్‌, మోటార్లకు హీట్‌ చేసే వ్యయం మొత్తం వర్క్‌ ఏజెన్సీనే భరిస్తుందని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి. డీ వాటరింగ్‌, మోటార్లను హీట్‌ చేయడం, మళ్లీ బిగించడం, ఎరిక్షన్‌ చేయడం ఇవన్నీ ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఆలోగా ప్రభుత్వం ట్రాన్స్‌మిషన్‌ లైన్లు పూర్తి చేయించినా కనీసం మోటార్లను వెట్‌ రన్‌ చేసే అవకాశం ఉండదు. ఇదంతా ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రభావం చూపిస్తుంది. కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ లో ఏ చిన్న ఘటన జరిగినా దానిపై రాజకీయ విమర్శలు చేసే ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి, ఆయన కేబినెట్‌ లోని కొందరు మంత్రులు, తమ ప్రభుత్వంలో జరుగుతోన్న తప్పిదాలను ఉద్దేశ పూర్వకంగా హైడ్‌ చేస్తున్నారు. ఇప్పటికే వరద బాధితులను ఆదుకోలేదని ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వర్షాలకు పంపుహౌస్‌ నీట మునిగిందనే ముచ్చట బయట పడితే విమర్శల దాడి ఎక్కువవుతుందనే ఈ ఘటనను దాచి పెట్టినట్టుగా తెలుస్తోంది.

Tags:    

Similar News