టీజీపీఎస్సీ మాటే శాసనం

నిరుద్యోగుల లొల్లిని పట్టించుకోలే.. 1:50 నిష్పత్తినే మెయిన్స్‌కు ఎంపిక.. ప్రజాప్రభుత్వంలో నిరుద్యోగులకు షాక్‌

By :  Raju
Update: 2024-07-04 03:57 GMT

తమ మాటే శాసనం అని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ తేల్చిచెప్పింది. గ్రూప్‌ -1 మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపికపై తమ వైఖరిలో మార్పు లేనే లేదని చెప్పేసింది. ఎవరేమన్నా చేసుకోండి.. సర్కారు ఏం చెప్పిందో అది మాత్రమే చేస్తామని కుండబద్దలు కొట్టింది. ఎవరు ఎంత లొల్లి బెట్టినా.. ఎన్ని రోజులు బువ్వ తినకుండా నిరాహార దీక్షలు చేసినా, ఆందోళనలు చేసినా.. తమ ఆఫీస్‌నే ముట్టడించినా.. ''సీతయ్య ఎవ్వరి మాట వినడు..'' అన్న సినిమా డైలాగ్‌నే రిపీట్‌ చేసింది. గ్రూప్‌ -1 మొత్తం పోస్టుల్లో ఒక్కో పోస్టుకు వంద మంది చొప్పున ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని ఎంపిక చేసి మెయిన్స్‌ నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. నిత్యం ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వం తమ గోడు వినాలని వేడుకుంటున్నారు. 1:50లో ఎంపిక చేస్తే ఎక్కువ మందికి అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారు. 1:100 పద్ధతిని అనుసరించాలని కోరుతున్నారు. అయినా ప్రభుత్వంగానీ, టీజీపీఎస్సీ కాని వారి ఆందోళనను పట్టించుకున్న పాపాన పోలేదు. 1:50 నిష్పత్తిలోనే మెయిన్స్‌కు అర్హులను ఎంపిక చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించేసింది. ''తాంబూలాలు ఇచ్చేశాం.. తన్నుకు చావండి..'' అన్నట్టుగా ప్రభుత్వం చోద్యం చూస్తోంది.

గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 చొప్పున అవకాశం కల్పించాలని నిరుద్యోగులు, విపక్షాలు చేస్తున్న విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడాల్సిన అవసరం ఉన్నదన్న సీఎం రేవంత్‌ రెడ్డి మాటలకు చేతలకు పొంతన ఉండదని అనేకసార్లు తేటతెల్లమైంది. అక్కడ నిరుద్యోగుల అభ్యర్థన మేరకు పోస్టులు పెంచారు. ప్రిపరేషన్‌ కోసం పరీక్షలు వాయిదా వేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం రేవంత్‌ సర్కార్‌ విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగుల పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ సర్కార్‌ వారి ఆవేదనను అర్థం చేసుకోవడం లేదు. వారి విజ్ఞప్తులపై స్పందించడం లేదు. ఇదేమని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నది. 2000 మంది నిరుద్యోగులు ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చేశారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 చొప్పున ఎంపిక చేయాలని, ఇది కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీనే తాము అడుగుతున్నామని నిరుద్యోగుల పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షం కొన్నిరోజులుగా ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నది. నిరుద్యోగుల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించాలని కోరుతున్నది. కానీ ఇవేవీ పట్టించుకోమన్నట్టు రేవంత్‌ ప్రభుత్వ వైఖరి ఉన్నది. తొమ్మిదిరోజులకు పైగా నిరుద్యోగుల సమస్యల సాధన కోసం గాంధీ ఆస్పత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేసి విద్యార్థి నాయకుడు మోతీలాల్‌ నాయక్‌ దీక్ష విమరణ అనంతరం నిరుద్యోగులపై కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. అధికారమార్పడి జరిగితే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని భావిస్తే ధర్నాలు, నిరసనలు చేసే పరిస్థితికి తీసుకొచ్చిందని ఆవేదన చేశారు. నిరుద్యోగుల సమస్యలపై ఇక నుంచి ప్రత్యక్ష కార్యాచరణ మొదలుపెడతామని ఆయన హెచ్చించారు. నిరుద్యోగులు రోడ్లపైకి వస్తున్నారు. అయినా కాంగ్రెస్‌ ప్రభుత్వం కనికరించడం లేదు. ఈ నేపథ్యంలోనే గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:50 చొప్పునే ఎంపిక చేస్తామని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది.

1:50 పద్ధతిలోనే అభ్యర్థుల ఎంపిక జరగనున్నది. సాధారణ పరిపాలనా శాఖ జారీ చేసిన జీవో నెం 29,55 నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్పీ స్పష్టం చేసింది. గ్రూప్‌-1:100 ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుని అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలని టీజీపీఎస్సీ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించిన సర్వీస్‌ కమిషన్‌ 1:100 పద్ధతి సాధ్యం కాదని తేల్చి చెప్పింది. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో 1:50 లోనే మెయిన్స్‌కు ఎంపిక ఉంటుందని పేర్కొన్నట్టు కమిషన్‌ తెలిపింది.

Tags:    

Similar News