పదేండ్లకే వలసవాదులకు పదవులూ దారదత్తమా?

ఢిల్లీకి గులాములు, సీమాంధ్రులకు బానిస సంస్కృతి వీడని హస్తం పార్టీ.. ఏపీ వ్యక్తికి తెలంగాణ ఎన్ఎస్యూఐ అధ్యక్ష పదవి

Update: 2024-08-20 07:06 GMT

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేండ్లే అయ్యింది. పదకొండో ఏడు నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత నేతలు ఢిల్లీకి గులాములు, సీమాంధ్రులకు బానిసలు అనే అభిప్రాయం ఉద్యమ కాలం నుంచి బలంగా ఉంది. దాదాపు ఆరు దశాబ్దాలు కొట్లాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. లీడర్ల మధ్య రాజకీయంగా విభేదాలు ఉండచ్చేమో కానీ అందరూ తెలంగాణ బిడ్డలేనని అన్ని పార్టీల వాళ్లను ఈ గడ్డ అక్కున చేర్చుకుంటోంది. పదేండ్ల తర్వాత రాష్ట్ర పాలన పగ్గాలను కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెట్టింది. ఉమ్మడి ఏపీలో వైఎస్ లాంటి నేతలు జాతీయ పార్టీలో వ్యక్తికేంద్రంగా పాలన సాగించిన సందర్భాలు చూశాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేంద్రంగా, ఆయన కనుసన్నల్లోనే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నాయి. ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణ బిడ్డ బల్మూరి వెంకట్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఆ స్థానాన్ని ఇటీవల భర్తీ చేశారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ సిఫార్సు మేరకు ఏపీకి చెందిన వెంకటస్వామికి తెలంగాణ ఎన్ఎస్యూఐ పగ్గాలు అప్పగించారు. రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలోనే సీమాంధ్రులకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు బానిసలు అన్న వాదనను నూటికి నూరుపాళ్లు నిజం చేశారు.

వెంకటస్వామిని తెలంగాణ ఎన్ఎస్యూఐ అధ్యక్ష పదవి నుంచి తప్పించి.. తెలంగాణ బిడ్డకే ఆ పదవి ఇవ్వాలని ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలు, ఎన్ఎస్యూఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వెంకటస్వామి ఏపీకి చెందిన వ్యక్తి అనే చెప్పే అన్ని ఆధారాలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వారు రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రుల ఆదిపత్యం ఉంది కాబట్టి తెలంగాణ లీడర్లు వారి చెప్పు చేతల్లో ఉన్నారంటే ఏమైనా అనుకోవచ్చు.. ఇప్పుడు స్వరాష్ట్రంలో ఏపీ వ్యక్తికి ఎందుకు పదవి ఇవ్వాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఎవరి మెప్పుకోలు కోసం ఎంతలా సాగిలా పడాల్సి వచ్చిందని, వెన్నుముక లేని వ్యక్తుల్లా అంతలా వంగిపోయి జీ హుజూర్ అని సీమాంధ్రులకు ఎందుకు ఊడిగం చేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ నేతలే మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రమేయం లేకుండా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడి నియామకం జరిగిందా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదివినంత మాత్రాన ఎడవెల్లి వెంకటస్వామి తెలంగాణ పౌరుడు అయిపోతాడా.. ఆయనకు ఎలా తెలంగాణ ఎన్ఎస్యూఐ పగ్గాలు అప్పజెప్తారని మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి వెంటనే జరిగిన తప్పును సరిదిద్దుకోవడంతో పాటు ఎవరి సిఫార్సు మేరకు వెంకటస్వామిని ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా నియమించారో వారిపైనా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వెంకటస్వామి ఏపీలోని బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని చిన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన వాడని, ఇందుకు తగిన ఆధారాలను పంపుతున్నామని, వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డికి.. తెలంగాణ ఎన్ఎస్యూఐ నాయకులు, ఇతర కాంగ్రెస్ నాయకులు రాసిన లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి.. ‘‘తెలంగాణ సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు, యువతకు, విద్యార్థులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు.. తెలంగాణ ఉద్యమంలో 1200 మందికి పైగా విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే ప్రధాన ఎజెండాగా విద్యార్థుల బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలసవాదిని నియమించారు. ఈ నియామకం యావత్ తెలంగాణ విద్యార్థి సమాజాన్ని అవమానించడమే. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వలసవాదిని ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా నియమించడంతో అన్ని వర్సిటీల్లోనూ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఆయనను తొలగించి తెలంగాణ వ్యక్తిని ఆ పదవిలో నియమించాలని విజ్ఞప్తి చేశారు. మా పదవులు మాకే కావాలి... తెలంగాణ విద్యార్థులు ముద్దు.. ఆంధ్ర వలసవాదులు వద్దు..” అని లేఖలో పేర్కొన్నారు.


రేవంత్​ రెడ్డికి రాసిన లేఖతో పాటు వెంకటస్వామి ఏపీకి చెందిన వ్యక్తి అని సమర్పించిన డాక్యుమెంట్ల కోసం ఈ లింక్​ క్లిక్​ చేయండి

Similar News