కొణతం దిలీప్ అరెస్ట్

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ ను అదుపులోొకి తీసుకున్న పోలీసులు

Update: 2024-09-05 10:38 GMT

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారనే కారణంతో ఆయనను సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిలీప్‌ అరెస్ట్‌ పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. కాంగ్రెస్‌ సర్కారు దౌర్జన్యకాండకు ఈ అరెస్ట్‌ నిదర్శనమని పేర్కొన్నారు. దిలీప్‌ ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వ తప్పిదాలను దిలీప్‌ ఎత్తిచూపుతున్నారని ఆరు నెలలుగా ఆయనను టార్గెట్‌ చేశారని తెలిపారు. గతంలోనూ ఒక అక్రమ కేసు పెడితే రేవంత్‌ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందని, దిలీప్‌ ను అరెస్ట్‌ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఎలాంటి కారణం చెప్పకుండా దిలీప్‌ ను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, సీఎం ఆఫీస్‌ నుంచి ఆదేశాలు ఉన్నాయని.. తమను ఏ వివరాలు అడగొద్దు అని పోలీసులు అంటున్నారని మండిపడ్డారు. ఏ కేసులో అరెస్ట్‌ చేశారు.. ఎఫ్‌ఐఆర్‌ సహా ఇప్పటి వరకు ఒక్క అంశంలోనూ పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ప్రజాపాలన పేరుతో ఈ దౌర్జన్యాలు ఏమిటని ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ప్రశ్నించేటోళ్ల గొంతు నొక్కడమేనా అని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత నిర్బంధాలు పెట్టినా ప్రశ్నించేవాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారన్నారు. అక్రమ అరెస్టులతో పాలన చేయవచ్చు అనుకోవడం భ్రమేనన్నారు. రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా వాక్‌ స్వాతంత్య్రం లేదని, నిరంకుశ పాలన సాగుతోందన్నారు. దిలీప్‌ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.


ఫిర్యాదు చేసింది కానిస్టేబుల్‌

కొణతం దిలీప్‌ పై పోలీసులకు పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో పని చేసే ఆర్‌. నితీశ్‌ కుమార్‌ అనే కానిస్టేబుల్‌ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (గురువారం తెల్లవారుజాము 12.30 గంటలకు) సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కు ఇంగ్లిష్‌ లో టైప్‌ చేసి ఫిర్యాదు చేశారు. తాను ''ఎక్స్‌''లో తెలుగు స్క్రైబ్‌ పేజీని సెర్చ్‌ చేస్తుననప్పుడు మతాల మధ్య విద్వేషాలు రగిలించేలా పోస్టులు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల ఆస్తులను దహనం చేసేలాంటి క్లిప్పులను ట్విట్టర్‌ లో సర్క్యులేట్‌ చేయడం విద్వేషాలకు తావిచ్చేలా ఉందని తెలిపారు. ఈ పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదును రాత్రి 12.30 గంటలకు ఎస్‌ఐ బి. నాగేందర్‌ రెడ్డి రిసీవ్‌ చేసుకుని జనరల్‌ డైరీలో ఎంటర్‌ చేశారని తెలిపారు. 66(సీ) ఐటీ యాక్ట్‌, 196 (బీఎన్‌ఎస్‌) కింద కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. కేసు విచారణను సైబర్‌ క్రైమ్‌ ఇన్‌ స్పెక్టర్‌ మధులతకు అప్పగించామని ఆ ఫిర్యాదు కాపీలోనే రాశారు.




 


Tags:    

Similar News