తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి కన్నుమూత

50 రోజులకు పైగా ఆస్పత్రిలో చికిత్స

Update: 2024-09-06 08:07 GMT

తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 50 రోజులుగా సికింద్రాబాద్‌ లోని యశోద హాస్పిటల్‌ లో చికిత్స పొందారు. బ్రెయిన్‌ ఇన్‌ ఫెక్షన్‌ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హాస్పిటల్‌ లో జాయిన్‌ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైనట్టు అనిపించినా అంతలోనే మళ్లీ మొదటికి వచ్చింది. కొన్ని రోజుల క్రితమే బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు, కాంగ్రెస్‌ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. మూడు రోజుల క్రితం బాలకృష్ణా రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది. శుక్రవారం మరింత సీరియస్‌ అయ్యింది. ఆయన బాడీ ట్రీట్‌ మెంట్‌ కు సహకరించకపోవడంతో భువనగిరిలోని స్వగృహానికి తరలించారు. ఆ తర్వాత కొంత సేపటికి ఆయన తుది శ్వాస విడిచారు. సాయంత్రం 4 గంటలకు భువనగిరి శివారులోని మగ్గంపల్లిలో గల ఫామ్‌ హౌస్‌ లో ఆయన అత్యక్రియలు నిర్వహించనున్నారు.

యువజన సంఘాల ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి

యువజన సంఘాల ఉద్యమం నుంచి బాలకృష్ణా రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో హైదరాబాద్‌ లోని ఎల్‌ బీ స్టేడియంలో నిర్వహించిన జాతీయ యువజనోత్సవంలో అప్పటి కేంద్ర యువజన సర్వీసుల శాఖ మంత్రి సునీల్ దత్, రాష్ట్ర మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా నేషనల్ యూత్ అవార్డు స్వీకరించారు. ఆ అవార్డు కింద ఇచ్చిన రూ.20 వేల క్యాష్ ప్రైజ్ ను అదే వేదికపై రాష్ట్రంలో యువజన సర్వీసుల బలోపేతానికి మంత్రి మంత్రి హరీశ్ రావు కు అందజేశారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ లో చేరిన యువతను తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేశారు. భువనగిరిలో తన తాత పేరు మీద కాలేజీ భవనం నిర్మించారు. అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. 2009లో టీడీపీ, టీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టు పార్టీల పొత్తులో భాగంగా భువనగిరి టికెట్ దక్కక పోవడంతో టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంట్‌ గా పోటీ చేశారు. గ్యాస్‌ సిలిండర్ గుర్తుపై ఆ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి బీఆర్‌ఎస్‌ లో చేరిన బాలకృష్ణా రెడ్డి తీవ్ర అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.

సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ సంతాపం

జిట్టా బాలకృష్ణా రెడ్డి మృతికి సీఎం రేవంత్‌ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆకాల మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేరాలని భగవంతుడి ప్రార్థించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో జిట్టా బాలకృష్ణా రెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్నారని మాజీ సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. ఆయన మరణానికి తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తెలంగాణ ఉద్యమకారుడు బాలకృష్ణా రెడ్డి మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. జిట్టా కోలుకుంటారని భావించానని.. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ వెంట నడిచిన వ్యక్తుల్లో జిట్టా ఒకరని, చిన్న వయసులోనే ఆయన లోకాన్ని వీడటం బాధకరమన్నారు. రాష్ట్ర సాధన కోసం సొంత ఆస్తులను లెక్క చేయడానికి ఉద్యమ నిర్మాణానికి కృషి చేశారని, అలాంటి నాయకుడిని కోల్పోవడం బీఆర్‌ఎస్‌ పార్టీకి తీరని లోటు అన్నారు.

తెలంగాణ మలిదశ ఉద్యమ సహచరుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం తనను కలచి వేసిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతికి తన సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ సాధన కోసం జరిగిన అనేక పోరాటాల్లో కలిసి పని చేశామని, భువనగిరి ప్రాంత ప్రజల కోసం ఆయన ఎంతో తపన పడ్డారని తెలిపారు. రాష్ట్రంలో యువజన సంఘాల సమాఖ్య ఏర్పాటు చేసి యువతను ఏకం చేసే ప్రయత్న చేశారన్నారు. తెలంగాణ సంబరాల పేరుతో సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించి తెలంగాణ వాదులను ఏకం చేశారని గుర్తు చేశారు. చిన్న వయసులోనే ఆయన దూరం కావడం బాధకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు.

Tags:    

Similar News