కర్నాటక స్కామ్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ను రక్షిస్తున్నది ఎవరు?: కేటీఆర్‌

కర్ణాటక వాల్మీకి స్కామ్‌ తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ స్కామ్‌తో ఇక్కడి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలకు లింకులున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ట్వీట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

By :  Raju
Update: 2024-08-24 05:28 GMT

కర్ణాటక వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ రాష్ట్ర నేతలు, వ్యాపారవేత్తలకు లింకులున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్‌ నుంచి రూ. 45 కోట్లు బదిలీ అయ్యాయని తెలిపారు. ఎంపీ ఎన్నికల వేళ నగదు డ్రా చేసిన బార్లు, బంగారు దుకాణాల నిర్వాహకులు ఎవరు? బార్లు, బంగారు దుకాణాల నిర్వాహకులకు కాంగ్రెస్‌తో ఉన్న సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాలకు రూ. 45 కోట్లు బదిలీ అయ్యాయి. వాల్మీకి స్కామ్‌కు సంబంధించి రాష్ట్రంలో సిట్‌, సీఐడీ, ఈడీ సోదాలు జరిగాయి. దర్యాప్తు సంస్థల సోదాలు వార్తలు బైటికి రాకుండా అణిచివేశారు. రూ. 95 కోట్ల అవినీతి జరిగిందని సీఎం సిద్ధరామయ్య కర్ణాటక అసెంబ్లీలో ప్రకటించారు. సిద్ధరామయ్యను తొలిగిస్తే తెలంగాణ ప్రభుత్వమూ కూలుతుందని కర్ణాటక మంత్రి సతీశ్‌ జార్కిహోళి ఎందుకు అన్నారు? ఇన్ని అంశాలు వెలుగులోకి వచ్చినా ఈడీ మౌనంగా ఎందుకు ఉన్నది? తెలంగాణ కాంగ్రెస్‌ ను ఎవరు రక్షిస్తున్నారని ? కేటీఆర్‌ ఎక్స్‌లో పలు ప్రశ్నలు సంధించారు.

ఈ స్కామ్‌ ఏమిటి?

కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్‌ ట్రైబ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరే షన్‌ లిమిటెడ్‌కు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన రూ. 187 కోట్లు పక్కదారి పట్టాయి. వాల్మీకి కార్పొరేషన్‌ అకౌంట్స్‌ సూపరింటెండెంట్‌ పీ చంద్రశేఖరన్‌ గత మే 26న ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన ఆరు పేజీల సూసైడ్‌ నోట్‌లో స్కామ్‌ గురించి బైటపెట్టారు. దీనిపై విచారణ చేయాలని ఒత్తిడి రావడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. ఈడీ కూడా రంగంలోకి దిగింది. లోక్‌సభ ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచడం కోసమే 'వాల్మీకి కార్పొరేషన్‌' నిధులను అక్రమంగా వాడుకున్నట్లు ఈడీ, సిట్‌ విచారణలోప్రాథమికంగా తేలింది. ఈ స్కామ్‌లో భాగమైన మాజీ మంత్రి నాగేంద్ర, వాల్మీకి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బసనగౌడ దద్దల్‌, మరో ఇద్దరు బ్యాంకు అధికారులు సహా మొత్తం 11 మందిని ఈడీ అరెస్టు చేసింది.

రూ. 187 కోట్లలో తెలుగు రాష్ట్రాలకు రూ. 90 కోట్లు చేరినట్టు సిట్‌ అంతర్గత నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్‌లోని ఆర్బీఎల్‌ బ్యాంకు చెందిన 9 ఖాతాలకు రూ. 44.6 కోట్లు బదిలీ అయ్యాయి. ఈ నగదుతో లోక్‌సభ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున మద్యం, ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.

రేవంత్‌కూ రేపోమాపో నోటీసులు రావొచ్చు: కర్ణాటక మంత్రి సతీశ్‌ 

ఈ నేపథ్యంలో కర్ణాటక మంత్రి సతీశ్‌ జార్కిహోళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు ఇచ్చినట్టే.. రేవంత్‌కు కూడా రేపోమాపో నోటీసులు రావొచ్చని ఆయన బాంబ్‌ పేల్చారు. వాల్మీకి సామాజికవర్గంలో బలమైన నేతగా పేరున్న సతీశ్‌ వ్యాఖ్యల బట్టి ఈ స్కామ్‌లో సీఎంకు నోటీసులు వస్తాయా? రాష్ట్రంలో ఈ స్కామ్‌ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందా? అని నెటీజన్లు ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News