నేడు రాష్ట్ర బడ్జెట్‌.. అసెంబ్లీకి కేసీఆర్‌

రాష్ట్రపూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థికశాఖమంత్రి భట్టి విక్రమార్క 12 గంటలకు శాససభలో ప్రవేశపెట్టనున్నారు.

By :  Raju
Update: 2024-07-25 04:44 GMT

రాష్ట్రపూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థికశాఖమంత్రి భట్టి విక్రమార్క 12 గంటలకు శాససభలో ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మంత్రి శ్రీధర్‌ బాబు ప్రవేశపెడుతారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులేమీ లేకపోవడంతో రాష్ట్ర బడ్జెట్‌ ఎలా ఉంటుందో చూడాలి. ఏఏ రంగాలకు ఎంత మొత్తం కేటాయిస్తారన్న ఆసక్తి నెలకొన్నది. ఎందుకంటే వందరోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న రేవంత్‌ సర్కార్‌ ఇప్పటివరకు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా ఏదీ సంపూర్ణంగా అమలు చేయలేదు. కేంద్ర బడ్జెట్‌పై భారీగా ఆశలు పెట్టుకున్న రేవంత్‌ పెద్దన్న మోడీ తెలంగాణకు పెద్ద గుండు సున్నా ఇచ్చాడు. దీంతో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలకు, బడ్జెట్‌లో కేటాయింపుల బట్టి పథకాల అమలుపై ప్రభుత్వ వైఖరి స్పష్టం కానున్నది.

మరోవైపు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రతిపక్ష హోదాలో నేడు అసెంబ్లీకి రానున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అనారోగ్యంతో గత రెండు సమావేశాలకు హాజరు కాలేదు. సభలో కేటీఆర్‌, హరీశ్‌రావులు సంధిస్తున్న ప్రశ్నలకే ఉక్కిరిబిక్కిరి అవుతున్న రేవంత్‌ ప్రభుత్వం కేసీఆర్‌ సభకు వచ్చి ప్రభుత్వ హామీలు, వాటి అమలు సాధ్యాసాధ్యాలపై ఎండగడితే రేవంత్‌ ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి నెలకొన్నది. ఎందుకంటే ఇప్పటికే ఏక కాలంలో రుణమాఫీ పెద్ద మోసం అని బీఆర్‌ఎస్‌ అధినేత ప్రకటించార. అలాగే నిరుద్యోగుల ఆందోళనలు, శాంతిభద్రతలు, సాగు నీటి విడుదలలో ప్రభుత్వ అలసత్వం, రైతు బంధు పైసలు ఇప్పటికీ రాకపోవడం వంటి అంశాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. ఈ అంశాలపై నిన్న బీఆర్‌ఎస్‌ శాసనసభ పక్షం వాయిదా తీర్మానాలు ఇస్తే స్పీకర్‌ తిరస్కరించారు. సభలో అన్ని అంశాలు చర్చిస్తామని, ప్రతిపక్ష నేతలను సభలోనే కూర్చోబెట్టి వారికి అన్ని వివరిస్తామని గప్పాలు కొట్టడమే కానీ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడం లేదని నిన్నటి సమావేశాలతో తేలిపోయింది.

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గ భేటీ రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతి కోసం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణకు బడ్జెట్‌ పద్దును అందించారు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ అనుమతి తీసుకున్నారు. బడ్జెట్‌ ప్రతిని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌కు, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిలకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అందించారు. శాసనసభలో ఈరోజు 2024- 25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు.

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టాక, బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన తర్వాత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ప్రత్యేక బస్సులో కాళేశ్వరం సందర్శనకు వెళ్లనున్నది. సాయంత్రం ఎల్‌ఎండీ రిజర్వాయర్‌ను సందర్శించనున్నది. బీఆర్‌ఎస్‌ బృందం రాత్రి రామగుండంలో బస చేయనున్నది. శుక్రవారం ఉదయం10 గంటలకు కన్నెపల్లి వద్ద ఉన్న లక్ష్మీ పంప్‌ హౌజ్‌ను పరిశీలిస్తుంది. అనంతరం

మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించనున్నది. అక్కడ ఆనకట్టు పరిస్థితి, పంప్‌ హౌజ్‌ వద్ద నీటిమట్టం, ఎత్తిపోసేందుకు అవకాశాలు, తదితరాల అంశాల గురించి పరిశీలిస్తుంది. గోదావరిలో ఉన్న నీటిని ఎత్తిపోసి రైతులకు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇవ్వడం లేదని బీఆర్‌ఎస్‌ విమర్శలు చేస్తున్నది. ప్రాజెక్టుల్లోకి నీటిని మళ్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ పర్యటనలు చేపడుతున్నట్టు బీఆర్‌ఎస్‌ పేర్కొన్నది.

Tags:    

Similar News