రైతు భరోసా అమలు కాలేదు.. రైతుబంధు పైసలు పడలేదు

కాంగ్రెస్‌ ప్రభుత్వం అలవిగాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక పథకాల్లో కోతలు, యూటర్న్‌ తీసుకుంటున్నది. తాజాగా రైతుభరోసాపై వేసిన కమిటీ కూడా ఇప్పట్లో తేల్చేలా లేదు.

By :  Raju
Update: 2024-07-03 05:42 GMT

మొగులు వైపు చూడకుండా రైతు సాగుకు సన్నద్ధం కావడానికి సాగు నీటి సౌకర్యం, పెట్టుబడి కోసం అప్పులు చేయకుండా రైతుబంధు పథకాన్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కల్పించింది. బీఆర్‌ఎస్‌ రైతుబంధు కింద ఏటా ఎకరానికి రూ. వేలు ఇస్తున్నది. మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు ఇస్తామని రేవంత్‌ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు యాసంగిలో అమలు చేయలేదు. రైతుబంధు కింద బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయడానికి కేటాయించిన నిధులను ఎన్నికల కోడ్‌ పేరుతో అడ్డుకున్నది. కోడ్‌ ముగిసిన తర్వాత కూడా ఆ డబ్బులను సకాలంలో రైతులకు అందించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటింది. రైతు భరోసా ఇప్పట్లో అమలయ్యేలా లేదు. ఇప్పటికే వానకాలం సాగు పనులు ప్రారంభమయ్యాయి. రైతు బంధు పైసలైనా వేయలేదు.

తాజాగా రైతు భరోసాపై ఉప సంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు సభ్యులుగా ఉన్నారు. గత నెల 22న జరిగిన క్యాబినెట్‌ సమావేశం నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీవో జారీ చేశారు. రైతు భరోసా పథకానికి అర్హతలు, విధివిధానాలు, మార్గదర్శకాలను మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సు చేయనున్నది. కమిటీ సిఫార్సులపై ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

గత ప్రభుత్వం సాగు చేసే అన్నిరకాల భూములకు రైతుబంధు పథకాన్ని వర్తింపజేసింది. రైతుబంధు పథకానికి పరిమితి పెట్టాలనే విజ్ఞప్తులు, డిమాండ్లు వచ్చినా వెంటనే నిర్ణయం తీసుకోకపోవడానికి పంటల వైవిధ్యమే కారణం. రాష్ట్రంలో అన్నిరకాల పంటలకు అనుకూల వాతావరణం ఉన్నది. దీంతో వ్యవసాయరంగ నిపుణుల సూచనల మేరకు సాగు విస్తీర్ణం పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకున్నది. ఎక్కువమంది రైతులు పండించే వరితో పాటు, ఇతర వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తే రాష్ట్ర అవసరాలు తీరడంతో పాటు రైతుల ఆదాయం పెరుగుతుంది అన్నది ప్రభుత్వ భావన. అలాగే విత్తనోత్పత్తికి తెలంగాణ రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉండటంతో అలా ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నింటిని దృష్ట్యా రైతుబంధుకు ఎలాంటి పరిమితి పెట్టలేదు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అలవిగాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక పథకాల్లో కోతలు, యూటర్న్‌ తీసుకుంటున్నది.

తాజాగా రైతుభరోసాపై వేసిన కమిటీ కూడా ఇప్పట్లో తేల్చేలా లేదు. రైతుబంధు ఐదు ఎకరాలు, పది ఎకరాల వరకే ఇవ్వాలా? ప్రజాప్రతినిధులు మొదలు ట్యాక్స్‌ కట్టేవారు, ప్రభుత్వ ఉద్యోగులనుదీని నుంచి మినహాయించాలా? వంటి అంశాలపై కమిటీ అధ్యయనం చేయనున్నది. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించనున్నది. ఆ తర్వాత వ్యవసాయ, రెవెన్యూ శాఖ క్షేత్రస్థాయిలో నివేదికలు తెప్పించుకుని ఎవరు సాగు చేస్తున్నారు? ఎవరు కౌలు రైతులు అనే లెక్కలు తేల్చేవరకు సెప్టెంబర్‌ దాటుతుంది. అప్పటికి దీనిపై ప్రభుత్వానికి స్పష్టత వస్తే యాసంగిలో అమలు చేస్తుంది. లేకపోతే ఈ అంశాన్ని వచ్చే ఏడాది వానకాలం వరకు సాగదీసే అవకాశాలు లేకపోలేదు. అప్పటివరకైనా రైతుబంధు పైసలు సకాలంలో రైతుల ఖాతాలో వేసేలా లేదు. ఎందుకంటే దీనిపైనా ప్రభుత్వానికి స్పష్టత లేదని తెలుస్తోంది.

Tags:    

Similar News